కొత్తగా విడుదల అయ్యే సినిమాల్లో ఏది హిట్ కొడుతుందో, ఏది ఫట్ మంటుందో తెలియని పరిస్థితి. అనేక సార్లు భారీ బడ్జెట్, పేరున్న నటుల చిత్రాలు మార్కెట్ లో బోల్తా పడొచ్చు. కొన్ని చిన్న చిత్రాలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల సినిమాలకు జనం జేజేలు కొట్టవచ్చు. ఇవే వేదికలపై అవార్డులు , రివార్డులు పొందవచ్చు. అంటే కథలో బలం ఉండాలి, కథనం ఆలోచింపజేసి, ఆసక్తి కలిగించేదిగా ఉండాలని అర్ధం. తెలుగులో “మెగా” ప్లాప్ లు , “పవర్” బోల్తా పడడం, బాలీవుడ్ లోనూ “బిగ్ బి”, “బాద్ షా” లాంటి వాళ్ళు పడ్డ ఇబ్బందులూ ప్రేక్షక లోకానికి తెలుసు. సినిమాల్లోనే కాదు వ్యాపార, విద్యా, రాజకీయ రంగాల్లోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. ఉదాహరణకు రాజకీయ పార్టీలను చూసుకుంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు పోటీగా వచ్చిన ప్రాంతీయ పార్టీలు కొన్ని నిలదొక్కుకోగా, అనేక పార్టీలు కనిపించకుండా పోయాయి. దీనికి కారణం ఆయా పార్టీల విధి, విధానాలు జనానికి నచ్చకపోవడం. కానీ, ఎలాంటి హామీలు, ఎజెండా, జండా లేకుండా దేశంలో రాత్రి రాత్రే పుట్టుకొచ్చిన “బొద్దింక” పార్టీ … అదే “కాక్రోచ్ జనతా పార్టీ” (సి.జె.పి.) గురించి ఇప్పుడు చర్చించుకోవలసిన అవసరం వచ్చింది.

గత వారం రోజులుగా దేశంలోని ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పతాక శీర్షికలకు ఎక్కిన ఈ పార్టీ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. కేవలం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి విద్యావంతులైన దేశ యువత పై చేసిన ఒకే ఒక దురుసు పదం “బొద్దింక”. యువతను ఆయన ఎప్పుడైతే బొద్దింకలతో పోల్చారో అదే రాత్రి “కొత్త బొద్దింక” ఒక పార్టీ రూపంలో జనంలోకి దూరింది. కుళ్ళిన పదార్ధాలతో పాటు కాగితాలు, డబ్బు ముక్కల వరకు దేన్నైనా తినే ప్రత్యేక జీవి బొద్దింక. అలాంటి దానితో నిరుద్యోగ యువతను పోల్చడంతో అదే బొద్దింక ఇప్పుడు సువిశాల దేశ రాజధాని ఢిల్లీ రోడ్లపై వీరంగం చేస్తోంది. పార్టీ రూపం దాల్చుకొని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్టు వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులను బొద్దింకల గుంపుగానే మార్చివేసింది. దేశంలో చరిత్ర కలిగిన ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నా రెండు నెలల కిందట పురుడు పోసుకున్న “కాక్రోచ్ జనతా పార్టీ” ఒక్క పిలుపుతో డిల్లీ వీధులు విద్యార్థి లోకంతో దద్దరిల్లడం నిజంగా ఆలోచింపజేసే పరిణామం. నీట్ పరీక్షలో చోటుచేసు కున్న భారీ అక్రమాలకు, ప్రశ్న పత్రాల లీకేజీ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్ తో విద్యార్థులు ఢిల్లీ వీధులెక్కారు. మొదటి రోజు పోలీసులు ఝళిపించిన లాఠీలు తెల్లారే సరికి విద్యార్థుల రూపంలో ఉన్న బొద్దింకలు రెట్టింపయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ ను, మంత్రుల నివాసాలను ముట్టడించాయి. దీంతో దేశ రాజధాని వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని మోడీ పాలనలో ఎన్నడూ చూడని స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, మంత్రి రాజీనామా డిమాండ్ డిల్లీ వీధుల్లో మార్మోగాయి. అయితే, విద్యార్ధులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది ఏ కాంగ్రెస్ పార్టీనో, వామపక్ష పార్టీలో, పేరున్న విద్యార్థి సంఘాలో కాకపోవడం విశేషం. కేవలం మొన్న మే నెల 16వ తేదీన సోషల్ మీడియాలో వేదికగా అంకురించిన కాక్రోచ్ జనతా పార్టీ మాత్రమే కావడం ఇక్కడ ప్రధానమైన చర్చ. రోడ్లపై ఉవ్వెత్తున సాగుతున్న నిరసన పోరులో ఎటు చూసినా సి. జె. పి అనే ప్ల కార్డులు, బ్యానర్లు కనిపించడం రాజకీయ, సామాజిక పరిశీలకులను విస్తుపరిచాయి.

క్రికెట్ టీమ్ లో కొత్త పిల్లవాడు పరుగుల వరద పారించిన సందర్భాలను గుర్తుకు చేసుకుంటున్నారు. నిన్న కాక మొన్న సామాజిక మాధ్యమ వేదికగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ పార్టీ పిలుపు ఎందుకు ప్రభంజనగా మారిందనేది రాజకీయ విశ్లేషకులే కాదు కేంద్ర నిఘా వర్గాలు సైతం విశ్లేషింస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ పై మే నెలలో ఉక్కుపాదం మోపి దానికి సంబంధించిన సామాజిక మధ్యమ ఖాతాలను మూతపడేసిన నేతలే రెండు నెలలు తిరగకుండానే అదే పార్టీతో చర్చలు జరపడం నిజంగా ఊహించని పరిణామం. అంతేకాదు, దేశంలోని ప్రముఖ విద్యార్ధి సంఘాలు, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ సైతం “కాక్రోచ్ “ కి మద్దతివ్వడం, కలిసి పోరాటానికి దిగడం కూడా ఆశ్చర్యకార అంశం. ప్రధాని మోడీ సైతం కాక్రోచ్ జనతా పార్టీ దూకుడు, దానికి లభిస్తున్న ఆదరణను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, సమస్యను సాగదీయకుండా కట్టడిచేసే ప్రయత్నంలో విద్యార్దులకు అనుకూలమైన ప్రకటనలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఫాస్ట్ ట్రాక్ విచారణకు ఆదేశించడం, కాక్రోచ్ నేతలతో చర్చలకు సిద్ధపడడం ఇందులో భాగంగా భావించ వచ్చు. విద్యార్ధి లోకం తిరగబడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మోడీ ప్రభుత్వానికి స్పష్టంగా తెసులు కాబట్టే నిరసన సెగలను వీలైనంత త్వరగా చల్లార్చడానికి భాజపా ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యార్దుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన, అదోళన సెగలు తగలడం ఇదే తొలిసారి.
