తెలంగాణ కోసం మహత్తరమైన పోరాటాలు,ఉద్యమాలు జరిగి, ఎంతోమంది ప్రాణాలు ధారా పోశారని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు అన్నారు. ఆ అమరుల త్యాగ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల స్మాకార్ధం సాగర తీరాన నిర్మించిన ఈ అమర జ్యోతి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అమరులకు నివాళులర్పించి ఉత్సవాలు ముగించాలని అనుకున్నా, తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారు గుర్తుకొస్తుంటే సంతోషం దుఃఖం ముందు ఒకేసారి వస్తున్నాయన్నారు. రాష్ట్రం కోసం అనేకమంది ప్రాణాలు వదిలారు. ఉద్యమంలో అనేక కేసులు, రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిసాయి. మహత్తరమైన పోరాటం ఆనాడు సాగింది. ఈ చిహ్నం పేరు అమర జ్యోతి గా నామకరణం చేశాం, భవనంలో అమరుల పేర్లు, ఫోటోలతో ప్రదర్శన ఉంటుంది. కొండ లక్ష్మణ్ బాపూజీ సూచన మేరకు ఈ స్థలంలో ఈ జ్యోతి నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. ఏ దేశం నుంచి ప్రతినిధులు వచ్చినా ఇక్కడ నివాళులు అర్పించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎన్ని సార్లు తెలంగాణ కోసం రాజీనామా చేశామో తెలియదు, కాని ప్రజల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ రాజీనామాలు చేశామన్నారు. మహాత్మా గాంధీ ఆచరించిన అహింస మార్గంలో హింసకు తావు లేకుండా తెలంగాణ సాధించామని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో అనేక మంది అమరులయ్యారన్నారు. ఇప్పటి వరకు 650 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, ఆర్ధిక సాయం అందించామని, ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ వివరాలు తెలియజేయాలని కోరారు. అమరుల త్యాగాలతో తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి, మంత్రులకు గుర్తుకు రావడానికే సచివాలయం వద్ద అమర జ్యోతిని నిర్మించినట్టు వివరించారు.