ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని బాలాజీ వికలాంగుల శాస్త్ర చికిత్స పునరావాస కేంద్రం (బర్డ్) అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా మారుతోందని టీటీడీ ఈవో ఎ వి ధర్మారెడ్డి వెల్లడించారు. “బర్డ్“ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ స్థాయి ఆర్థో ప్లాస్టీ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సమ్మిట్‌లో 10 నుంచి 12 దాకా మాత్రమే లైవ్ సర్జరీలు చేస్తుండగా బర్డ్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న సమ్మిట్ లోనే 22 లైవ్ సర్జరీలు నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలో పేరొందిన టాప్ 20 ఆర్థో సర్జన్లు ఇక్కడికి వచ్చి సర్జరీలు చేస్తున్నారని వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సర్జన్లు పాల్గొనడం అభినందనియమని ధర్మారెడ్డి అన్నారు. ఇలాంటి సమ్మిట్ లు సర్జరీల్లో నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగ పడతాయని ఆయన తెలిపారు. బర్డ్ లో క్లిష్టమైన, అరుదైన ఆపరేషన్లే కాకుండా సెరిబ్రల్ పాల్సీ తో పాటు ఇతర క్లిష్టమైన ఆపరేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేస్తున్నామని చెప్పారు. సమ్మిట్ లో పాల్గొన్న సర్జన్లు కూడా పేదలకు ఉచితంగా ఆప రేషన్లు చేయడానికి ముందుకు రావాలని కొరారు. ఇలా ఉచిత సేవ చేయడానికి ముందుకొచ్చే డాక్టర్లకు వసతి,రవాణా, భోజనం, తిరుమల స్వామివారి దర్శనం ఉచితంగా కల్పిస్తామని ఈవో చెప్పారు.