
సోషల్ మీడియా నిబంధనల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్ర ప్రేదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. సచివాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మహిళలపై పైశాచికత్వానికి పరాకాష్టగా సోషల్ మీడియాలో పోస్టింగులు ట్రోల్ చేయడం దురదృష్టకరమన్నారు. ప్రధానంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులకు చెందిన మహిళలపై అసభ్యకరమైన పదజాలంతో పాటు అశ్లీల చిత్రాలు, అక్రమ సంబంధాల వంటి కట్టు కథల పోస్టింగులు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఎంతో జుగుప్సాకరమైన విషయమని అసంతృప్తి వ్యక్తం చేశారు. యు.కె. లో ఉంటున్న ఒక మహిళ రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్న వారి కుటుంబ మహిళలపై సోషల్ మీడియాలో ఎంతో బాధాకరమైన పోస్టులు పెట్టడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. అయితే, అటు వంటి వారిని ప్రతి పక్షాల వారు సమర్థించడం ద్వంద నీతికి నిదర్శనమన్నారు. ఇటు వంటి సందేశాలు ఇవ్వడం ద్వారా వారు సమాజానికి ఎటు వంటి సంకేతాలు ఇస్తున్నారనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మ పేర్కొన్నారు. సోషల్ మీడియా సమాజంలో సృష్టించే దారుణమైన పరిస్థితులను నియంత్రించడంలో న్యాయ, పోలీస్ వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితులో ఉండటం వల్ల సమస్య మరింత జఠిలం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.