ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవెట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంద్రప్రదేశ్ కి బయలుదేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుయుగూరు – నిమ్మలగూడెం గ్రామాల జాతీయ రహదారిపై వరద నీటిలో చిక్కుకుంది. కుయుగూరు వాగు వరద నీరు రహదారిపై చేరడం, తెల్లవారు జామున 4.30 గంటలకు చీకటిగా ఉండడంతో డ్రైవర్ కి వరద నీరు సరిగా కనిపించ లేదు. దీంతో వరద నీటిలో నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు వెళ్లి వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన డ్రైవర్ బస్సును నిపిపి వేసి సుమారు 45 మంది ప్రయాణికులను దించేసాడు. ప్రయాణికులు అక్కడి నుండి మోకాళ్ళ లోతు వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చింతూరు రెవిన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సహాయంతో వరద నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.