కెనడాలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, ఒంటారియా ప్రావిన్స్ లో గుర్ విందర్ నాథ్ (24) అనే యువకుడు పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో మిస్సిసాగా అనే ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గుర్ విందర్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అతడి వాహనాన్ని దొంగలించారు. ఈ దాడిలో గుర్ విందర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జులై 14న మృతి చెందినట్లు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. గుర్ విందర్ మృతి ఎంతో బాధాకరమని, అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. జులై 27న గుర్ విందర్ మృతదేహాన్ని భారత్ కు తరలించనున్నారు. మరోవైపు గుర్ విందర్ పై దాడి, హత్యను ఖండిస్తూ అతడికి నివాళిగా సుమారు 200 మంది భారతీయ విద్యార్థులు మిస్సిసాగాలో క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు.