ప్రముఖ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారు. ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని జయసుధ కలవడంతో ఈ ఉహగానలకు తెరలేచింది. ఇద్దరూ సుమారు గంటకు పైగా సమావేశం అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరేందుకు రెండు, మూడు రోజుల్లో న్యూఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మంది నేతలను పార్టీలోకి ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా పార్టీ వ్యూహంపై చర్చించేందుకు కిషన్‌రెడ్డి ఇప్పటికే పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో కలిసి న్యూఢిల్లీకి వెళ్లారు. వాస్తవానికి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు జయసుధ గతేడాది బీజేపీలో చేరాల్సి ఉండగా, కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రముఖ నటి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1970-1985 సంవత్సరాల్లో అనేక చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన ఆమె 2009లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకిఎన్నికయ్యారు. కానీ, 2014 ఎన్నికల్లో ఆమె ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరిగి 2019లో ఆమె తన కుమారుడు నిహార్ కపూర్‌తో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో వైఎస్‌ఆర్‌సీలో ఇమడలేక పోయారు.ఇప్పుడు బిజెపి పై దృష్టి పెట్టింది.