రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇంటి స్థలాల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యేక తెలంగాణ సాధించుకొని పదేళ్ళు కావస్తున్నా ఆ పోరాటంలో ప్రత్యక్ష సాక్షులు , కలం వీరులైన విలేకరులను ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. సమాజంలో బాధ్యత కలిగిన నాలుగో వర్గం (ఫోర్త్ ఎస్టేట్)గా ఉన్న జర్నలిజాన్ని , దాని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుసున్నాయి. ఏ కేసులోనైనా చివరకు సుప్రీం కోర్టు తీర్పే శిరోధార్యం అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం, అధికారులు సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టు సంఘాలు, మీడియా అకాడమీ సలహాలు, సూచనలను పట్టించుకునే ఆలోచన అధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గాని ఎందుకు చేయచేయడం లేదనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ గానీ, పురపాలక శాఖ మంత్రి కేటిఅర్ గానీ జర్నలిస్టుల పట్ల నూరు శాతం సానుకూల వైఖరి చూపిస్తున్నా అది ఆచరణకు నోచుకోక పోవడం అసంతృప్తికి గురిచేస్తోంది. ప్రభుత్వ నాన్చుడు ధోరణి వల్ల మొన్నటి వరకు ఇళ్ళ స్థలాల కోసం కళ్ళల్లో వత్తులు పెట్టుకొని సమష్టిగా ఎదురు చూచిన జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సభ్యుల్లో విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ఆదేశాల మేరకు పేట్ బషీరా బాద్ లోని 38 ఎకరాల తమ భూమిని కాపాడుకోవడానికి చివరకు సొసైటీ పాలక వర్గాన్నిసైతం కాదని న్యాయాన్ని వెతుకుంటూ కొందరు సభ్యులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి నిర్ణయించుకున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అయితే, పేట్ బషీరా బాద్ భూమిని ఇతరుల చేతికి అంటే ముఖ్యంగా కభ్జా కోరుల కోరల్లో చిక్కుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి, తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి మాత్రమే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు, అంతేకానీ ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనే ఆలోచన తమకు లేదని సొసైటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ లో లేని విలేకర్ల కోసం నాలుగైదు సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి సూచనల మేరకు జర్నలిస్టు సంఘాలు, మీడియా అకాడమీ కలిసి నగరం చుట్టూ పక్కల స్థలాల కోసం అన్వేషించారు. అప్పట్లో కొంగర్ కలాన్, బుద్వేల్ ప్రాంతాల్లో సరిపడ భూమి అందుబాటులో ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. కానీ ఏమి జరిగిందో ఏమో ఈ బృందం వెతికిన స్థలాలకు మోక్షం కలగలేదు. ఇప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు వెలిశాయి. కనీసం అప్పుడే ఆ ప్రాంతాలో కొత్త వారికి స్థలాలను నిర్ణయించి ఉంటే ప్రస్తుతం ఇంత సమస్య తలెత్తేది కాదని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. నెల రోజు కిందట కూడా మంత్రి కేటిఅర్ మీడియా అకాడమీ చైర్మన్ తో జరిగిన చర్చల్లో ఇళ్ళ స్థలాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టే హడావిడి చేశారు. నేటికీ ఫలితం కనిపించ లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గానీ, మీడియా అకాడమీ గానీ వెంటనే జ్యోక్యం చేసుకొని హౌసింగ్ సొసైటీ సభ్యులతో పాటు, కొత్త వారికి కూడా ఇళ్ళ స్థలాల విషయంలో స్పష్టత ఇస్తే బాగుంటుందని సీనియర్ జర్నలిస్టులు, వారి సంఘాల నాయకులు సూచిస్తున్నారు.