హైదరాబాద్ జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయంలో ప్రభుత్వం ఏ విషయాన్ని తేల్చక పోవడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పడంలో అధికారుల నాన్చుడు ధోరణి సొసైటీ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం ఒక్క జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల వ్యవహారంలోనే ఎందుకు స్తబ్దంగా వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదని సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పేట్ బషీరాబాద్ స్థలాన్ని సొసైటీ కి అప్పజెప్పాలని ఐదారు నెలలుగా అటు సొసైటీ నేతలు, అనేక మంది సభ్యులు ముఖ్య నేతలు, సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే లేడు. చివరకు కమిటీ లోని కొందరు సభ్య్యులు ఏకమై అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి సన్నద్ధం అయ్యారు.
కొద్ది రోజులుగా నగరం నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ లో వకాల్తానామా పై సంతకాల సేకరణ జరుగుతున్న విషయం తెలిసి కూడా సంబంధిత అధికారులు ఏ మాత్రం పట్టించుకోక పోవడం నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉంది. తమ న్యాయమైన సమస్య సాధన కోసం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ పాలక వర్గాన్నికూడా కాదని కొందరు సభ్యులు కొండంత ఆశతో రోడ్డెక్కి తమ గోడును వివిధ రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. కష్ట పడి కొనుక్కున్న భూమిపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి ఏడాది గడుస్తున్నందున ఈ లోపే తమ వంతుగా స్థలాన్ని కాపాడుకునే క్రమంలో తప్పని పరిస్థితుల్లో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్నట్టు సభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు సభ్యుల నుంచి వకాల్తానామా పై సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్సపటికైనా న్యాయమైన ఈ సమస్య పై పట్టింపులు, ఇతర ఒత్తిళ్లను పట్టించుకోకుండా సమస్యను పరిష్కరించాలని జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.