అక్కడ ముమ్మరం…ఇక్కడ నీరసం…

images 20

హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రభుత్వ హామీ మేరకు మంజూరు చేయాల్సిన ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్న జాప్యం విలేకర్లు, జర్నలిస్టు సంఘాలను అసంతృప్తికి గురి చేస్తోంది. డబ్బు చెల్లించి, 16 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న పాత్రికేయులకు, కొత్తగా ఇళ్ల స్థలాల కోసం వేచిచూస్తున్న వారికీ ప్రభుత్వం న్యాయం చేస్తామనే చెబుతోంది. కానీ, ఎప్పుడు అనేది మాత్రం స్పష్టంగా చెప్పడం లేదు.అయితే, ఇదే విలేకర్ల వర్గానికి జిల్లాల్లో మాత్రం స్థలాలు కేటాయించడం, వారికి మంజూరు చేయడం వేగంగా జరిగి పోతోంది. ఖమ్మంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు నెల రోజుల్లోనే ఇళ్ల స్థలాలు విలేకర్ల చేతికి అందాయి.అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అందోల్ లో ఎం.ఎల్. ఎ. క్రాంతి కిరణ్, వరంగల్ లో మంత్రి కెటిఆర్, మంచిర్యాలలో ఎమ్మెల్యే బాల్క సుమన్ ల చొరవతో అయా ప్రాంతాల విలేఖర్లకు ఇళ్ల స్థలాల ప్రక్రియ ఊపందుకుంది. మంచిర్యాల జిల్లాలో ఇళ్ల స్థలాలతో పాటు మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ప్రభుత్వ బాల్క సుమన్ ప్రకటించడంతో అక్కడి జర్నలిస్టులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాల్లో ఒకవైపు స్థలాలు మంజూరు చేసుకుంటూ ఒక్క హైదరాబాద్ లో పనిచేస్తూ, వేచి చూస్తున్న జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోందనేది అర్థం కావడం లేదని జర్నలిస్టు నేతలు, సీనియర్ పాత్రకేయులు పేర్కొంటున్నారు. పేట్ బషీరాబాద్ ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పాలని ఏడాది కిందట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా దానికి అతీగతీ లేకపోవడంతో సొసైటీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ స్థలం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొందరు సభ్యులు సుప్రీం కోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం నుంచి గానీ, సంబంధిత అధికారుల నుంచి గానీ ఏమాత్రం స్పందన రాకపోవడంతో సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే, జర్నలిస్టులకు స్థలాల కేటాయింపు పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని స్థలాన్ని అప్పగించే అంశంతో సహా, కొత్త వారికి ఏ విధంగా, ఎక్కడ స్థలాలు కేటాయించాలనే విషయంపై సంబధిత అధికారులు చర్యలు చేపట్టినట్టు తసమాచారం అందుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అన్నీ సవ్యంగా జరిగితే కొద్ది రోజుల్లోనే హైదరాబాద్ జర్నలిస్టులకు స్థలాల విషయంలో ప్రభుత్వం నుంచి శుభవార్త రావచ్చని ఆశాభావం వ్యక్తం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *