జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, కేటాయింపుపై అటు సచివాలయం, ఇటు ప్రగతి భవన్ లోనూ జరుగుతున్న కసరత్తు తుది దశకు చేరుకుందని, మరికొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని “ఈగల్ న్యూస్” మొన్ననే చెప్పింది. ఆవ గింజంత సమాచారం అయినా సరే ఫలితం కోసం తాపత్రయ పడుతున్న వారికి ఖచ్చితంగా అది వార్త అవుతుంది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయడం, పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి అప్పజెప్పి, ఆ సొసైటీలో లేని వారికి కూడా న్యాయం చేసే కోణంలో ముఖ్యమంత్రి, సంబంధింత అధికారులు ఎప్పటిప్పుడు చర్చిస్తున్నట్టు సమచారం అందుతోంది.
సొసైటీకి చెందిన సభ్యుల బృందం కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన విషయాన్ని కూడా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. కొత్తగా ఇళ్ల స్థలాల కోసం ఒత్తిడి తెస్తున్న జర్నలిస్టులు, సొసైటీ సభ్యుల ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారానికి వేగంగా అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇళ్ల స్థలాల ప్రక్రియ తుది దశకు చేరుకుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి స్థలాన్ని బదలాయిస్తూ, కొత్త వారి కోసం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒకే వేదిక నుంచి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.