ఏ రచయిత అయినా, కవి అయినా తన కలం ముందుకు కదలాలి అంటే నింగినో, నేలనో, పచ్చని ప్రకృతినో, జాలువారే జలపాతాలనో లేక సామాజిక పరిస్థితులనో అంశంగా తీసుకుంటారు. కానీ, ఖాదర్ అనే అధ్యాపకుడు వేరే కోణం ఎంచుకున్నారు. ఐదేళ్ల కిందటే ఆయన తన కలాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వైపు సంధించారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

హైదారాబాద్ కి చెందిన ఆంగ్ల భాష అధ్యాపకులు ఎస్. ఎ. ఖాదర్ ఇస్రో చేపడుతున్న పరిశోధనలు, రాకెట్ ప్రయోగాలను భూమికగా తీసుకొని దేశంలోనే మొట్టమొదటి వైజ్ఞానిక దేశభక్తి గీతాన్ని రచించారు. అంతేకాదు, అన్ని వర్గాల వారిని ఆకర్షించే స్థాయిలో విద్యార్థులతో చక్కని వీడియో పాట రూపొందించారు. 2017వ సంవత్సరం అక్టోబర్ నెలలో దీపావళి నాడు ఈ దేశభక్తి పాటను విడుదల చేసి పలువురి మన్ననలు పొందారు. అనేక మంది సినీ రచయితలు, సంగీత దర్శకులు, సామాజిక, రాజకీయ ప్రమఖులు ప్రశంశిచారు. ఈ గీతాన్ని ఇస్రో అధికారిక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసినట్టు రచయిత ఖాదర్ చెప్పారు. ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న ఇస్రోను కీర్తిస్తూ “జయహో ఇస్రో”….” సలామ్ తుజే ఇస్రో” అంటూ సాగే గీతాన్ని జాతికి అంకితం చేసినట్టు ఖాదర్ వివరించారు.
ఎలాంటి ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించ కుండా కేవలం దేశభక్తిని మాత్రమే చాటుతూ ఈ పాటను రాసినట్టు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన ఖాదర్ ప్రస్తుతం హైదరాబాద్ లో లిటిల్ మాస్టర్ స్కూల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఖాదర్ కాలం నుంచి జాలువారిన ఆ గీతం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.