ఇంకో చిరుత…

IMG 20230907 WA0015

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వెళ్లే భక్తులకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు శ్రీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కిన చిరుతను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాత్రి పన్నెండు, ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందన్నారు. రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత అని తెలిపారు. ప్రయాణికులు ,భక్తుల క్షేమం, వారి సౌలభ్యం కోసం టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే అన్నారు.అటవీశాఖ అధికారుల సహకారంతో, దాదాపు 300 మంది అటవీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందని చెప్పారు. ఈ కృషి ఫలితంగా ఐదవ చిరుతను పట్టుకోగలిగినట్టు ఆయన తెలిపారు.

IMG 20230907 WA0022

ఇప్పటివరకు ఇద్దరు పిల్లలు చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించినట్లు తెలిపారు. ఆ తర్వాత మరింత అప్రమత్తతో నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా భద్రత సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు చేసామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతిస్తున్నామని భూమన వివరించారు.భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నిన్నటి నుంచి చేతి కర్రలు కూడా పంపిణీ ప్రారంభించామన్నారు.చిరుతల పట్టివేత ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందని వివరించారు. చైర్మన్ వెంట జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు, అటవీశాఖ డీఎఫ్ఓ సతీష్ రెడ్డి, విజివో బాలి రెడ్డి, ఏవీఎస్వో సతీష్, ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *