హైదరాబాద్ లో జర్నలిస్టులకు కేటాయించిన భూమి వ్యవహారం గందరగోళంగా మారుతోంది. పేట్ బషీరాబాద్ లో గత ప్రభుత్వం కేటాయించిన 38 ఎకరాల భూమిని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి బదలాయించడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. అంతేకాక్, ఈ నెల 6 తేదిన సుప్రీంకోర్టులో చోటుచేసుకున్న పరిణామం అంతుపట్టకుండా ఉందని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఎన్.వి. రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ఆ తీర్పును కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సొసైటికి చెందిన కొందరు సభ్యులు గత నెలలో ప్రభుత్వం పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ద్వారా పేట్ బషీరాబాద్ ప్రభుత్వానికి ఏవైనా సూచనలు రావచ్చని వేచి చుసిన సభ్యులకు కోర్టు నుంచి అంతుపట్టని విషయం బయటకు వచ్చింది. ధిక్కార పిటిషన్ పై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోగా పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం ఉహించని అంశాన్ని తెకపైకి తెచ్చింది. ఈ పిటిషన్ ను ప్రధాన కేసుతో జతచేసి పరిశీలిస్తామని చెప్పడం అంతుపట్టకుండా ఉంది. దీనిపై సొసైటీ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఎం.ఎల్.ఎ.లు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.అధికారుల స్థలాల కేసుతో ప్రమేయం లేకుండా జర్నలిస్టుల కేసుని విడదీసి జస్టిస్ రమణ గత ఏడాది ఆగస్టులో ఇళ్ళ స్థలాల సమస్యపై తుది తీర్పు ఇచ్చారు. పేట్ బషీరాబాద్ లోని స్థలం జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకే చెందుతుందని స్పష్టంగా సూచించారు. అయితే, ధిక్కార పిటిషన్ పరిశీలించిన ధర్మాసనం మాత్రం ఈ పిటిషన్ ని తిరిగి ప్రధాన కేసుతో జతచేసి పరిశిలిస్తామనడం స్పష్టత లేకుండా ఉందని కొందరు సీనియన్ న్యాయవాదులు కూడా పేర్కొంటున్నారు. ప్రధాన కేసు నుంచి విడదీసి తుది తీర్పు ఇచ్చిన అంశాన్ని తిరిగి అదే కేసుకు ఎలా జత చేస్తారని సొసైటీ సభ్యులు అసంతృప్తి చెందుతున్నారు. సాక్షాత్తూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జర్నలిస్టుల అంశాన్ని ప్రధాన కేసు నుంచి విడదిసినప్పుడు అందులో ఏదైనా సమస్య వస్తే దాన్ని కూడా విడిగానే పరిశీలించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విడదీసి తుది తీర్పు ఇచ్చిన కేసును తిరిగి పాత కేసుకు అంటగట్టి విచారించాలనుకోవడం ఏమరకు సమంజసమనే వాదనలు తలెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని మరోసారి ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే, హైదరాబాద్ లో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల విషయాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న శాసన సభ సమావేశాల్లో ఈ వ్యవహారం చివరి దశలో ఉందని చెప్పిన ముఖ్యమంత్రి అధికారులతో ఈ విషయం పురోగతిపై తిరిగి ఆరా తీసినట్టు సమాచారం అందుతోంది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ స్థలం బడలయించడంతో పాటు అందులో సభ్యులు కాని వారికి సైతం సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్థల పరిశీలన, విధి,విధానాలు పరిశీలించి సందర్భం చూసుకొని ముఖ్యమంత్రి కే.సి.అర్. స్వయంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది.