రాష్ట్రంలో అమలు పరుస్తున్న ఇసుక పాలసీ దేశం లోనే ఉత్తమమైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. గనులు,భూగర్భ వనరుల శాఖ పై ఉన్నతాధికారులతో డా.బి.ఆర్. ఆంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గనుల శాఖ డైరెక్టర్ కాత్యాయని, టీఎస్ఎండీసీ ఎండీ మల్సూర్, ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో ఆయన గనులు మరియు భూగర్భ శాఖ పనితీరును సమీక్షించారు. ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన ఖనిజ బ్లాక్ ల వేలంలో భాగంగా వేలం వేయడానికి పొందిన పర్యావరణ అనుమతుల తో పాటు స్థాపన , ఆపరేషన్ కొరకు పొందిన అనుమతులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలు ప్రగతికి తోడ్పాటుగా ఉంటాయని అన్నారు. గనుల శాఖ దేశంలోనే ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2267 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా రూ.3884 కోట్లు ఇప్పటి వరకు సమకూరడం పై అభినందిస్తూ మరింత పటిష్టంగా పనిచేసి లక్ష్యాలను సాదించాలని చెప్పారు.
గనులు, చిన్న తరహా మైనింగ్ లీజ్ లపైమరింత మంచి విధానం అమలవుతుందని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని అధికారులకు సూచించారు. గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తెస్తామని తెలిపారు. సాంకేతికతను అనుసంధానం చేసి గనులు,భూగర్భ వనరుల శాఖను మరింత బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని వివరించారు. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్లైన్ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయని వాటిని మరింత మెరుగైన విధంగా అమలు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలో అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. టీఎస్ఎండిసి సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో 101 రీచ్ ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని వివరించారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తదితరాల తవ్వకాలకు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు వ్రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.