ఈ నెల 16,17 తేదీలలో హైదరాబాద్ లో జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో హాజరయ్యే జాతీయ నాయకుల భద్రత కల్పించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు డీజీపీ అంజనీ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 16, 17న తాజ్ కృష్ణలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతాయన్నారు. 17న విజయ భేరి బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, దీనికి సంబంధించి భద్రతను అందించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్ ఇవ్వకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేశాయని మండిపడ్డారు. విజయభేరి బహిరంగ సభకు భద్రత కల్పించాలని కోరామన్నారు. కేసీఆర్ రాజకీయ విజ్ఞతతో వ్యవహరించాలని హితవుపలికారు. ప్రభుత్వం నుంచి ఆటంకాలు కలగకుండా చూడాలన్నారు. విజయభేరీ సభకు ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. కేసీఆర్ చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తుక్కుగూడాలో సభ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించామని చెప్పారు. కనీవినీ ఎరుగని విధంగా విజయభేరి సభను నిర్వహించి తీరతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనను డీజీపీ దృష్టికి తిసుకువెళ్లినట్టు రేవంత్ చెప్పారు.