భాగ్య నగరానికి మధ్యలో ఉన్న మూసి నది, ఈసా నదులపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలోని మూసి పరివాహక ప్రాంతంలో భూమి పూజ చేశారు. 168 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఐదు బ్రిడ్జిలను నిర్మించనున్నది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూసి, ఈసా నదులపై పలు వంతెనలను ప్రతిపాదించినది. ఇందులో భాగంగా ఈ నదులపై 14 వంతెనలను నిర్మించనున్నారు. అందులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో మూసినదిపైన మూడుచోట్ల, ఈసా నదిపై రెండు చోట్ల నిర్మాణ పనులను చేపడుతోంది. సుమారు 42 కోట్ల రూపాయలతో ఉప్పల్ బాగాయత్ లే అవుట్ వద్ద, 35 కోట్లతో ప్రతాపసింగారం- గౌరెల్లి వద్ద మూసీ నదిపై 39 కోట్లతో మంచిరేవుల వద్ద, 32 కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలోని ఈసా నదిపై, మరో 20 కోట్ల వ్యయంతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలోని ఈసా నదిపై హెచ్ఎండిఏ వంతెనలు నిర్మించనున్నది. ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున నాలుగు వరుసల వంతెన నిర్మాణం జరగనున్నది.