మహబూబ్ నగర్ జిల్లా చరిత్ర…
మహబూబ్ నగర్ ప్రాంతం చాలా కాలం దొరలూ, సంస్థానాదిశుల చేతిలో ఉండేది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, భూస్వాములు పెతనం సాగేది. ముఖ్య సంస్థానాలలో గద్వాల,జటప్రోలు, కొల్లాపూర్ అమరచింత సంస్థానాలు ముఖ్య మైనవి. జిల్లాకు దక్షిణాన వనపర్తి, ఉత్తరాన రంగారెడ్డి, వికారాబాద్, పడమట నారాయణ పేట, తూర్పున రంగారెడ్డి, నాగర్ కర్నూల్, సరిహద్దులుగా ఉన్నాయి. హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైక ఏకైక ముఖ్యమంత్రిని అందించిన జిల్లా కూడా మహబూబ్ నగర్ కావడం విశేషం. రాష్ట్రంలో మొదటి,, దేశంలో రెండవ పంచాయతి సమితి ఈ జిల్లాలోనే ఏర్పాటు అయింది. ఈ మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి అని కూడా పిలిచేవారు. చివరకు హైదరాబాద్ నిజాం ఆరవ నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ జిల్లాకు మహబూబ్ నగర్ అనే పేరు వచ్చింది. గోల్కొండ వజ్రం ఈ ప్రాంతంలోనే దొరికినట్లు నానుడి ఉంది.
జిల్లా వాయవ్య ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉండి తరుచుగా కరువుకు గురైతుంటే,, ఆగ్నేయాన పూర్తిగా దట్టమైన అడవులతో నిండి ఉంది. అమ్రాబాదు, కొల్లాపూర్, అచ్చంపేట మండలాలు నల్లమల అడవులలో భాగంగా ఉన్నాయి. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం కూడా నీటిపారుదల సమస్యతో సతమతమైయేది. దిండి, జూరాల ప్రాజెక్టుల వల్ల కొంత మేర సస్యశ్యామలంగా మారాయి.
విభజన తర్వాత…
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 64 మండలాలలో 9 మండలాలతో వనపర్తి జిల్లా 16 మండలాలతో నాగర్కర్నూల్ జిల్లా, 9 మండలాలతో జోగులాంబ గద్వాల జిల్లా, 3 మండలాలు వికారాబాద్ జిల్లా పరిధిలో చేరగా, 7 మండలాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో చేరాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోకసభ నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 1546 రెవెన్యూ గ్రామాలు, 1348 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.