మహాభారత, రామాయణ కాలాల్లో దుష్ట శిక్షణ కోసం అస్త్రంగా వాడినట్టు చెప్పుకునేది “సుదర్శన చక్రం”. మహా విష్ణు కుడి వైపు వెనుక చేతిలో ఉంటుందని ఇతిహాస ,పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్యాస్త్రమే శిశుపాలుని తల నరికింది. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజు సూర్యుడిని కప్పి ఉంచడానికి ఉపయోగించారు. అర్జునుడి కుమారుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుని జయధ్రుతుడిని చంపడానికి కూడా దోహదపడింది . ఋగ్వేదంలో సుదర్శన చక్రాన్ని విష్ణువుకు చిహ్నంగా, కాల చక్రంగా, మహా భారతంలో కృష్ణుడి ఆయుధంగానూ సుదర్శన చక్త్రం ప్రసిద్ధి. ఈ అస్త్రం ప్రధాన లక్ష్యం “దుష్ట శక్తుల నిర్మూలన”. నేటి ఆధునిక “సుదర్శన చక్ర” ఆయుధానికి ఇదే ఉప శిర్షికగా నిలిచింది. చారిత్రక సుదర్శన చక్రా ఫలితాలను మనం చూడ లేదు గానీ, ఇప్పుడు యుద్ధ భూమిలో వీరంగం చేస్తున్న “సాంకేతిక సుదర్శన చక్రం” మాత్రం దాయాది దేశానికి చుక్కలు చూపుతోంది. చేత కాకున్నా”జిహాద్” అంటూ కయ్యానికి కాలు దువ్విన తీవ్రవాద దేశం పాకిస్థాన్ భారత సరిహద్దుల వద్ద ఎక్కుపెడుతున్న మిసైళ్ళు, డ్రోన్లు, ఫైటర్ జెట్ లను సునాయాసంగా నేలకూలుస్తోంది. “నేనున్నా” అంటూ దేశ ప్రజలకు గుండెంత భరోసా, కొండంత ధైర్యం ఇస్తోంది. అందుకే సరిహద్దుల్లో ఇసుక తిన్నెల మధ్య , మంచు కొండల అంచులలో కాపుకాసుకొని వీరోచితంగా పోరాడుతున్న ఈ కంప్యుటరైజ్ “ సుదర్శన చక్ర”.. అదే “ఎస్- 400” గురించి తెలుసుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. అందుకే “ఈగల్” ఈ ప్రత్యేక కథనాన్నిమీకోసం తీసుకువచ్చింది .

ప్రత్యేకతలు…
ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలలో “ఎస్-400” క్షిపణి రక్షణ వ్యవస్థ ఒకటిగా పేరు పొందింది. ఈ వ్యవస్థలో కీలకంగా మూడు భాగాలు పని చేస్తాయి. అవి క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా పసిగట్టి ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను క్షణాల్లో నేల మట్టం చేయగలదు. ఇది కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్ర సమన్వయంతో అనేక అధునాతన రాడార్లు, క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని బహుళ ప్రయోజన(మల్టీ ఫంక్షన్) రాడార్ వ్యవస్థలో 92ఎన్2ఈ గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడార్, 96ఎల్6 చీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడార్ ముఖ్యమైనవి. ఇవి 360-డిగ్రీల నిఘాను అందిస్తూ, 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఎస్-400 ఏక కాలంలో 300 వరకు లక్ష్యాలను పసిగట్ట (ట్రాక్ చేయ) గలదు. ఒకేసారి 36 ముప్పు లక్ష్యాలను ఛేదించ గలదు.
క్షణాల్లో యాక్టివ్ మోడ్..
ఎస్-400 వ్యవస్థ అత్యంత సరళమైంది. దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించ వచ్చు. అంతే వేగంగా యాక్టివేట్ చేయవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఐదు నిమిషాల్లో, స్టాండ్‌బై లో ఉన్నప్పుడు 35 సెకన్లలో దీని వ్యవస్థ కార్యాచరణకు సిద్ధమవుతుంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రాలర్లపై అమర్చి ఉంటాయి., రోడ్లపై గంటకు 60 కిమీ, ఆఫ్-రోడ్‌లో గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణించ గలవు. భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే (సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ – ఎస్.ఎ.ఎమ్.) వ్యవస్థల్లో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని కొందరు అత్యంత ప్రమాదకరమైనదిగా, ఇంకొందరు ప్రాముఖ్యం ఉన్న వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వ్యవస్థ తన అపారమైన దూర శ్రేణి సామర్థ్యాల కారణంగా నార్త్ అంట్లాంటిక్ ట్రిటి అర్గనైజేషన్ (నాటో) సభ్య దేశాలకు కూడా ప్రధాన సవాలుగా మారింది. రష్యా భారత దేశానికి చిరకాల మిత్ర దేశం కావడం వల్ల వీటిని సరఫరా చేసింది.

అమ్ముల పొదిలో…
ఎస్-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి నాలుగు రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. వాటిలో మొదటిది “40ఎన్6”. ఇది 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి. రెండవది “48ఎన్6”. ఇది 250 కిలోమీటర్ల దూర లక్ష్యాన్ని చేధించ గల ప్రభావవంతమైన మధ్యశ్రేణి క్షిపణి. మూడవది “9ఎం96ఈ”, నాలుగవది “9ఎం96ఈ2”. ఈ రెండూ 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధిలో వేగంగా దూసుకు వచ్చే యుద్ధ విమానాలను, టార్గెట్ కు దగ్గరయ్యే ఆయుధాలను నాశనం చేయ గల స్వల్ప,మధ్యశ్రేణి క్షిపణులు సుదర్శన చక్ర అమ్ముల పొదిలో దాగి ఉంటాయి. ఈ క్షిపణులు గంటకు సుమారు 17 వేల కిలోమీటర్ల వేగంతో (మాక్ 14) ప్రయాణించే లక్ష్యాలను, అదేవిధంగా10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో, అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా అడ్డుకుంటాయి. పాకిస్థాన్ మూడు రోజులుగా భారత్ పైకి సంధిస్తున్న మిసైళ్ళు, డ్రోన్లు, అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎఫ్-16, జె.ఎఫ్-17 వంటి యుద్ధ విమానాలకు సైతం మాన రక్షణ కవచం సుదర్శన్ చక్రం అడ్డుకుంది. ఏకంగా పాకిస్థాన్ పైలెట్ నే పట్టించింది. అందుకే శత్రు దేశం పాకిస్థాన్ ఎత్తుగడలను తునాతునకలు చేస్తూ ఆ దేశ సైన్యానికి, ముష్కర మూకలకు ముచ్చెమటలు పట్టిస్తున్న మన సుదర్శన్ చక్ర నిజంగానే భారత ప్రజలకు ఓ దివ్యాస్త్రం. అందుకే నీకు సెల్యూట్…!