పగ చల్లారిందా? ఎక్కుపెట్టిన “సుదర్శన చక్రం” నిస్సహాయంగా మిన్నకుండి పోయిందా? మంచు కొండల పచ్చిక బైళ్ళలో అమాయకులను విచక్షణా రహితంగా కాల్చి చంపిన ముష్కరులు ఏమైపోయారు? వాయు వేగంతో శత్రు దేశంపై విరుచుకు పడిన ఆవేశం అకస్మాత్తుగా ఎందుకు ఆవిరై పోయింది? కాశ్మీర్ వాస్తవాధీన రేఖను ఎందుకు చెరిపివేయలేక పోయాం? ఇందులో ప్రపంచ “పెద్దన్న” జోక్యం ఏ మేరకు ఉంది? అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.) ఒక్క రోజులోనే వేల కోట్ల రూపాయల నిధులు పాకిస్థాన్ కి ఎలా మంజూరు చేసింది? పహేల్గాంలో వేసవి సేదదీరుతున్న వారిలో 27 మంది మహిళల నుదుట కాశ్మీరం సాక్షిగా రాలిన సిందూరం ఎందుకు మసక బారింది? తమ ఆత్మ గౌరవానికి భంగం కల్గించిన సద్దాం హుస్సేన్, ఒసామా బిన్ లాడెన్ లను మట్టుపెట్టే పతంలో అమెరికా ఇలానే వ్యవహరించిందా? నరహంతకులు మసూద్ అజార్, దావూద్ ఇబ్రహీం ఎక్కడ? వాళ్ళను పట్టుకోలేకనా, పట్టు సడలిందా? బలం లేకున్నా బలుచిస్తాన్ పోరాట యోధులు పాకిస్థాన్ మూకలను తరిమి కొట్టిన రీతి అంతు పట్టలేదా? ఇలాంటి అనేక ప్రశ్నలు సగటు భారతీయుల్లో ఇప్పుడు తలెత్తుతున్నాయి.

యుద్ధం రావాలని, దాన్ని కావాలని ఏ ఒక్కరు కోరుకోరు. కానీ, పహల్గాం ఘటన తర్వాత సుమారు రెండు వారాలు హడావిడి చేసి, దానికి “సిందూరం” అనే రంగు పులిమిన భారత ప్రభుత్వ తీరు ముష్కరులను ఎట్టకేలకు పట్టుకుంటుదని ఆశించారు. దాని కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. చివరకు శత్రు దేశంపై విరుచుకు పడ్డారు. ఆ దేశపు కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా కాలు దువ్వింది. వందల కోట్ల మంది భరతమాత బిడ్డలో కొత్త ఆశలు రేకెందించింది. ఈ దెబ్బతో ఏడు దశాబ్దాల కాశ్మీర్ – పాక్ మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను చెరిపి వేస్తుందని వేచి చూశారు. రెండు రోజులు గడిచే సరికి ఆ ఆవేశ, కావేశాలను పహల్గాం మంచు బిందువులలో కలిపేసింది.ఎవరు ఏవిధంగా అనుకున్నా జరిగింది రాజకీయం అనేది బహిరంగ రహస్యంగా తెరపైకి వచ్చింది. దేశంలో అత్యంత కీలకమైన నిఘా వ్యవస్థ పహల్గాం మూకల ఆచూకీ తెలుసుకోలేక పోవడం దురదృష్టకరం. ఇప్పటికీ వాళ్ళు, వాళ్ళ వద్ద ఉన్న ఆయుధాలు ఎక్కడున్నాయనే ప్రాధమిక సమాచారం కూడా భారత నిఘా సంస్థల దగ్గర లేక పోవడం అతి పెద్ద లోపం. పహల్గాం సంఘటన జరిగిన నాటి నుంచి అటు ప్రధాని మోడీ, ఇటు హోమ్ మంత్రి అమిత్ షా కట్టలు తెంచుకున్న ఆవేశంతో ముష్కరులను పట్టి తీరుతామని పదేపదే చాటి చెప్పారు. విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) కి అప్పజెప్పి చేతులు దుప్పుకున్నారు. ఇప్పటి వరకు ముష్కరుల ఆచూకీ కనుకొనడంలో సాధించింది శూన్యం. యుద్ధం మొదలైంది… ముగిసింది. ఎందుకు? ఎవరికోసం? అనేది ప్రశ్నార్థకం. భారత్ – పాక్ కాల్పుల విరమణ పహల్గాం ఘటనకు ప్రభుత్వాలు కప్పిన ఒక మంచు దుప్పటిగా మిగిలిపోతుంది.