జర్నలిస్టుల ఇంటి స్థలాల అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని శ్రీధర్‌బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీకి నివేదిస్తామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు జి.ప్రతాప్‌రెడ్డి, దండ రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు ఆదివారం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, జర్నలిస్టులు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వమే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన జర్నలిస్టులకు నెలకు రూ. 10 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వ, ప్రై వేటు విద్యా సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్ స్కీం అమలు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డిని కోరారు.