హైదరాబాద్ తార్నాక లోని ఇంగ్లిష్, విదేశీ భాషల విశ్వవిద్యాలయం(ఇఫ్లూ)లో లైగిక వేధింపులను నిరోధించడానికి ఏర్పాటు చేసిన “సెన్సిటైజేషన్,ప్రివెన్షన్ మరియూ రిడ్రేసల్ అఫ్ సెక్స్ వల్ హెరాస్మెంట్”(స్పర్శ్)ని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్లూ విద్యార్ధులు నిరసన మొదలు పెట్టారు. లైంగిక వేధింపులను అదుపు చేయడానికీ, సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన స్పర్శ్ ని గత జూన్ నెల నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలిపారు.
ఇదే విషయాన్ని స్పర్శ్ చైర్ పర్సన్ గా ఉన్న రేవతి శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్ళినా సరైన సమాధానం రాలేదని, దీంతో అసలు స్పర్శ్ కి ఎవరు బాధ్యత వహిస్తున్నారనేది అంతుపట్టకుండా ఉందని విద్యార్ధులు వివరిస్తున్నారు. స్పష్టమైన విధి, విధానాలతో సరైన బాధ్యులను నియమించి స్పర్శ్ ను పూర్తీ స్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ నిరసనకు ఎ.బి.వి.పి., డి.ఎస్.ఎ. వంటి విద్యార్ధి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ వ్యవహారంలో యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తే నిరసన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.