“దొర”ల పాలన వద్దు.…

rahul tea c

తెలంగాణలో ప్రజల రాజ్యం నడవాలని పదేళ్ళ కిందట  సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ అది ఈనాడు దొరల చేతుల్లోకి వెళ్లిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కోరుకుందీ, ఆశించింది దొరల తెలంగాణ కాదు, ప్రజల తెలంగాణ అని పేర్కొన్నారు. “దొరల తెలంగాణ కు, ప్రజల తెలంగాణకు” మధ్య కొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. ఆర్మూరులో జరిగిన విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

rahul in 3

ప్రత్యేక తెలంగాణా ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజల గొంతు వినిపిస్తుందనుకున్నాము కానీ, అది ఒకే కుటుంబం చేతిలో బందీ అవుతుందని ఉహించాలేదన్నారు. ముఖ్యమంత్రి  కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందనీ, పదేళ్లుగా ప్రజల సొమ్ము దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే  కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా ప్రజలకు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇబ్బడి,ముబ్బడిగా పెరిగిన కరెంటు బిల్లులతో సామాన్యులు సతమతం అవుతున్నారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు తెలిపారు.అదేవిధంగా వృద్దులకు 4వేల రూపాయలు, పెన్షన్, మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెల 2500 రూపాయలు,500 రూపాయలకే లకే వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతుభరోసా ద్వారా ఏడాదికి ఎకరాకు రూ.15వేలు, రైతు కూలీలకు 12వేల రూపాయలు అందించనున్నట్టు రాహుల్ వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట, హామీలను ఇప్పటికీ మరచిపోదనీ,దానికి పొరుగున ఉన్న కర్నాటక, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను ఉదాహరణగా తీసుకోవచ్చు అని సూచించారు. తెలంగాణాలో పసుపు రైతులకు ప్రధాని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పసుపు రైతులకు క్వింటాకు రూ.12 వేలు నుంచి 15వేల రూపాయల మద్దతు ధర కల్పించనున్నట్టు రాహుల్ చెప్పారు.కాంగ్రెస్ పార్టీ తరపున అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదనీ, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరనున్నట్టు స్పష్టం చేశారు. ఇందిరమ్మ మీ భూముల కోసం కొట్లాడిన సంగతి గుర్తుందా అని ప్రశ్నించారు.

rahul pub in 3

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కి  తెలంగాణతో అనుబంధం ఇప్పటిది కాదనీ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోందన్నారు. బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం ఒక్కటే, బీఆరెస్ కారు టైర్ లో వారికి తెలియకుండానే గాలి పోయిందన్నారు. బీజేపీతో పోరాడిన నాపై 24 కేసులు పెట్టారనీ, మరి కేసీఆర్ పై ఎన్ని కేసులున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాలపై కేసులు పెట్టె ప్రధాని మోదీ కేసీఆర్ పై ఎందుకు పెట్టడంలేదన్నారు. పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు బీఆరెస్ మద్దతు పలికి బిజెపికి వత్తాసు పలుకుతోందని వ్యాఖ్యానించారు. ఇక,ఏ బలం లేకపోయినా ఎంఐఎం అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్నారు. బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ను ఓడించేందుకే ఎంఐఎం పోటీకి దిగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణాలో  బీఆరెస్ ను,  రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ లో బీజేపీ ని ఓడించి తీరనున్నట్టు రాహుల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *