అధికారులకే అంతుపట్టని కారణంతో ఆశ్చర్యంగా కుంగిపోయిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. రెండు రోజుల కిందట కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ వద్ద కుంగిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఈ కమిటీ బ్యారేజీని పరిశీలించింది.19, 20, 21వ పిల్లర్ల వద్ద పగుళ్లకు గల కారణాలను అన్వేషించింది. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేయనుంది. సమగ్ర పరిశీలన తరవాత కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందిస్తుంది. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈ.ఎన్.సి. వెంకటేశ్వర్లు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు ఉన్నారు.
ఇదిలా ఉంటే, పిల్లర్లు కుంగిపోవడం పై ప్రభుత్వం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించే విధంగా గుర్తు తెలియని వ్యక్తుల చర్యల వల్ల పిల్లర్లు కుంగిపోయి ఉంటాయనే అనుమానంతో డ్యామ్ సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఎ. రవికాంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మహదేవ్ పూర్ పోలీసులు 427 సెక్షన్ కింద 174/2023 నెంబర్ తో ఎఫ్.ఐ.అర్. నమోదు చేశారు.