అధికారుల అవినీతి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం. ఎన్నికల వేడిలో అధికార,విపక్ష పార్టీల విమర్శలు,వాదనలు ఎలా ఉన్నా పిల్లర్లు కుంగిపోవడం అధికారుల పర్యవేక్షణ వైఫల్యానికి, గుత్తేదారు నిర్లిప్తతకు ప్రత్యక్ష సాక్ష్యం. కుంగి పోవడానికి దారి తీసిన లోపాలను, కారణాలను ఇంజనీరింగ్ అధికారులే కాదు ప్రభుత్వం కూడా బాధ్యతగా అంగీకరించాలి. వేల కోట్ల ప్రజాధనం ధారగా పోసి ఎన్నో కలలు, ఆశలతో నిర్మించిన సౌధం మూన్నాళ్ళ ముచ్చటగా మారుతుంటే రాజకీయ నాయకుల్లో మాత్రమే కాదు, సామాన్యుల్లోనూ, సామాజిక పరిశీలకుల్లోనూ ప్రశ్నిచే స్వరం, నిలదీసే బలం పెరుగుతుంది.
ప్లానింగ్, డిజైన్ ,క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్. డి.ఎస్.ఎ)తేల్చడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయ పడుతున్నారు.
బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి, నిపుణుల నివేదికకు రాజకీయాలు ఆపాదించడం విచారకరం అంటున్నారు. బ్యారేజీకి సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని, 20 అంశాలపై సమాచారం అడిగితే రాష్ట్ర అధికారుల నుంచి కేవలం 11 అంశాలకు చెందిన వివరాలే అందాయని ఆనకట్టల భద్రత సంస్థచెబుతోంది. ఇన్ స్ట్రుమెంటేషన్, వర్షాకాలం ముందు, తర్వాత ఇన్స్ స్పెక్షన్ రిపోర్టులు, కంప్లేషన్ రిపోర్టులు, క్వాలిటీ రిపోర్టులు, థర్డ్ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్ల పై సమాచారం అందించలేదని ఎన్.డి.ఎస్.ఎ. స్పష్టంగా తెలిపింది. కేంద్ర బృందం చెబుతున్న విషయం వాస్తవమైతే కేంద్రం రాష్ట్రం పై చట్టపరమైన చర్యలకు తీసుకునే అవకాశం ఉందని సీనియర్ అధికారులే చెప్పడం గమనార్హం. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయనేది ఎన్.డి.ఎస్.ఎ. నివేదిక సారాంశం. ప్రస్తుత పరిస్థితిలో బ్యారేజ్ ను ఉపయోగించడానికి అవకాశం లేదని కూడా స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగడానికి ప్రధాన కారణాలను ఎన్.డి.ఎస్.ఎ. నివేదిక ఇలా వివరించింది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని, పునాది సామగ్రి పటిష్టంగా లేదని, బ్యారేజ్ బరువు వల్ల కాంక్రీట్ బీటలు వారిందని, బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా రూపొందించారు, కానీ దానికి తగ్గట్టు స్థిరమైన నిర్మాణం జరగలేదని కేంద్ర బృందం పేర్కొంది. ఈ దశలో రిజర్వాయర్ ని నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందని సూచించారు. మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు జరిగాయని, ఈ రెండు ప్రాజెక్టులలో ఇవే తరహా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎన్.డి.ఎస్.ఎ.హెచ్చరించింది. అన్నారం, సుందిళ్లను యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేయాలని అభిప్రాయ పడింది. బ్యారేజీకి అంతపెద్ద మొత్తంలో నష్టం జరిగినా ప్రభుత్వం ఏ ఒక్క అధికారిపై గానీ, నిర్మాణ సంస్థ పై గానీ ఈసమెత్తు చర్యలు తీసుకోకపోవడం కూడా విమర్శలకు తెర లేపుతోంది.
ఇదిలా ఉంటే ఒక సమస్యపై విచారణ జరిపిన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవడం అధికారులు,ప్రభుత్వం తక్షణ కార్యక్రమం. కానీ, కేంద్ర నివేదికను తప్పుదారి పట్టించే విధంగా, కేంద్ర బృందాన్ని, నిపుణుల విచారణను కించ పరిచేలా రాజకీయ పార్టీలు వ్యవహరించడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. రాజకీయ విమర్శలు, వాదనలు పక్కన పెట్టి లక్ష్మీ బ్యారేజీని పునరుద్ధరించడానికి త్వరితగతిన చర్యలు చేపడితే మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.