“చెయ్యి”ఎత్తిన షర్మిలా…!

sharmila c1

కేసీఆర్ మీద ప్రజలకు తారా స్థాయిలో వ్యతిరేకత ఉందని, కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేక ఓటును చీల్చొద్దనే ఒకే ఒక్క ఆలోచనతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయే అవకాశం ఉందని, మళ్లీ కేసీఆర్ కు అవకాశం ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఈ విషయంలో లోతుగా పరిశీలించిన తర్వాతే రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణించుకున్నట్లు వివరించారు. దివంగత మహానేత వైయస్ఆర్ తయారు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనీ, వైయస్ఆర్ బిడ్డే కాంగ్రెస్ ను ఓడించడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలు కోరినట్టు షర్మిల చెప్పారు.ఉమ్మడి రాష్ట్రంలో వైయస్ఆర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. కర్ణాటకలో మాదిరి గానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ గెలిచే అవకాశం ఉందన్నారు. ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీకి ఆహ్వానించారని, కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతి పెద్ద సెక్యూలర్ పార్టీ కితాబు ఇచ్చారు.

ఓటు బ్యాంకు నేను చీలిస్తే తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమించరన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వైయస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు. 10 రోజుల కిందట వైయస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేయాలను కున్నా సమయం గడిచే కొద్ది కొన్ని సమీకరణాలు మారిపోయాయని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద జోక్ అని మరొక్కసారి ప్రజలకు అర్థం అయ్యిందన్నారు. కేసీఆర్ చదివిన 80 వేల పుస్తకాల్లో ఇంజనీరింగ్ పుస్తకాలు లేవా అని ప్రశ్నించారు.తొమ్మిదేండ్లుగా కేసీఆర్అ నేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించ దానికే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు షర్మిల చెప్పారు. ఈ నిర్ణయం వైయస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకు చాలా బాధ కలిగిస్తుందనీ, తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న త్యాగాన్ని నాయకులు ఏకీభవిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఎవరైనా బాధ పడుతుంటే వారికి క్షమాపణ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *