అనుమానితులు, నిందితులను పట్టుకున్న 14 రోజుల్లో నేర పరిశోధన పూర్తి చేసి ఆధారాలను కోర్టు ముందు ఉంచాల్సిన పోలీసు యంత్రాంగం నిర్లిప్తత వల్ల అనేక మంది రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం, అధికారులు, రాజకీయ నేతల తెరచాటు జోక్యం, వాళ్ల ఒత్తిళ్లు ఖైదీలకు శాపంగా మారుతోంది. చట్టల్లోని లొసుగులు కూడా కేసుల సాగదీతకు కారణం అవుతున్నాయి. ఫలితంగా రిమాండ్ ఖైదీల పరిస్థితి దయనీయంగా మారుతోంది. దోపిడి, దొంగతనాల కేసుల్లో దొరికిన నిందితుల విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలలో ఇరుక్కుపోయి జైలుకి వెళ్ళిన వారికి నేరారోపణ ఎప్పుడు నిర్ధారణ అవుతిందో తెలియదు కానీ రిమాండ్ రూపంలో నెలల తరబడి జైళ్లలో ఉండడం అధికమైంది. దశాబ్ద కాలంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సంస్కృతి అధికమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో గాలి జనార్ధన్ రెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి లాంటి నేతలు రకరకాల ఆరోపణలతో చంచల్ గూడా జైలులో రిమాండ్ జీవితం గడిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా 16 నెలల పాటు ఎలాంటి బెయిల్ కి నోచుకోకుండా జగన్ మోహన్ రెడ్డి నాలుగు గోడల మధ్య బందీ అయిన విషయం తెలిసిందే. అదే తరహాలో గాలి జనార్ధన్ రెడ్డి కూడా నెలల కొద్ది జైలులోనే ఉన్నారు. అయితే, వీళ్ళ పై చేసిన ఆరోపనలుగానీ, నమోదు చేసిన కేసులు గానీ నేటికీ రుజువు కాకపోవడం గమనార్హం. మొన్నటికి మొన్న డిల్లీ లిక్కర్ కుంభకోణం వ్యవహరంలో అరెస్టు అయిన డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. వాదనలు, ప్రతివాదనలు, అసమగ్ర చార్జిషీట్ ల మధ్య నెలాలు గడుస్తున్నాయే గానీ నేరాలు, అభియోగాల నిరూపణకు మోక్షం రావడం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా అదేవిధంగా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో ప్రధానంగా రెండు కేసులను పరిశీలిస్తే విచారణ సంస్థల వైఫల్యం స్పష్టంగా అర్ధం అవుతుంది. ఎప్పుడో సుమారు ఐదేళ్ళ కిందట అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాస్ని అక్కడికక్కడే అరెస్టు చేసినప్పటికీ విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2018 వ సంవత్సరంలో జరిగిన ఈ కేసులో దాడికి పాల్పడ్డ జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ “కోడికత్తి” శ్రీనుని సంఘటన జరిగినప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో నేరం జరిగింది కాబట్టి కేసుని సమగ్ర విచారణ కోసం స్థానిక పోలీసుల నుంచి ఎన్.ఐ.ఎ.కి బదలాయించారు. అప్పటి నుంచి రకరకాల కోణాల్లో విచారణ జరుగుతోంది. నిందితుడు మాత్రం దాదాపు ఐదు ఏళ్లుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శ్రీనివాస్ ఎన్నిసార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఒకసారి మాత్రం ఎన్.ఐ.ఎ.కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. విశాఖ ఎన్ఎస్ఐఏ కోర్టులో జరుగుతున్న కోడికత్తి కేసు విచారణపై ఈ నెల రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. ఎనిమిది వారాల పాటు విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ జగన్ మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణను మరో ఆరు వారాల పాటు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అంతే ఉంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాములో అరెస్టు అయిన చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉండబట్టి 50 రోజులు దాటింది. ఆయనకు బెయిల్ ఎప్పుడు మంజూరు అవుతుందనేది కూడా అంతుపట్టని ప్రశ్నగా మిగిలింది. చంద్రబాబు తఫున న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ వేయడం, దానికి కౌంటర్ గా ప్రభుత్ర్వ ప్లీడర్ సెక్షన్లు జోడించడంతో బాబు బెయిల్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే, ఆయా కేసులపై సమన్యులలో సైతం రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. అరెస్టు చేసిన వారికీ సంబంధించిన కేసుల్లో పోలీసులు గానీ, విచారణ సంస్థలు గాని పూర్తీ స్థాయి ఆధారాలను కోర్టుల ముందు ఎందుకు ఉంచలేక పోతున్నాయనేది ప్రతీ ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్న. దీనికి ఆయా కేసులను విచారిస్తున్న ప్రభుత్వ సంస్థల వైఫల్యమా లేక చట్టంలో ని లొసుగులు కారణమా అనేది తేలవలసి ఉంది.