ల‌క్ష్మీకాసుల హారం శోభాయాత్ర

laxmi varah c

తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం తిరుచానూరు శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారి వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జ‌రుగ‌నున్న గ‌జ, గ‌రుడ వాహ‌న‌సేవ‌ల్లో అలంక‌రించేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌క్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉద‌యం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని,నవంబర్ 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజ వాహన సేవ జరగనుందని,దీనికోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

laxmvarah in

ముందుగా తిరుమ‌లలో శ్రీవారి ఆల‌యం నుండి ఈ హారాన్ని ఆల‌య నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు. తిరుమ‌ల‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి,ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, విజివో శ్రీ నంద కిషోర్, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి పాల్గొన్నారు. అనంత‌రం తిరుమ‌ల‌ నుండి వాహ‌నంలో భ‌ద్ర‌త నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం కాసులహారాన్ని అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ కు అంద‌జేశారు. అక్క‌డ హారానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి మంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ ఊరేగింపుగా ఆల‌యం వద్దకు తీసుకెళ్లారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌ద‌క్షిణ‌గా గ‌ర్భాల‌యంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి అలంకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న భాస్కర్ రెడ్డి దంపతులకు ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *