“దేశం-సేన” పొత్తుపై తెలంగాణ ప్రభావం…?

sena bjp

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పొత్తుపై తెలంగాణ ఎన్నికల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయా? జనసేన వ్యవహార శైలి దీనికి దారి తీసే అవకాశం ఉందా? తెలంగాణలో జనసేన బిజెపితో అంటకాగుతున్నతీరు తెలుగుదేశం అధినాయకత్వానికి మింగుడు పడడం లేదా? పొత్తుల విషయంలో జనసేన ఏకపక్షంగా, దూకుడుగా వ్యవహరిస్తోందా? రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసిన టిడిపి,“సేన” చేతుల పట్టుసడలే ప్రమాదం ఉందా? ఇలాంటి అనేక  ప్రశ్నలకు రాజకీయ పరిశీలకుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయన అరెస్టుతో పాటు, పార్టీనే అణచివేయాలని ఒక పార్టీ చూస్తుంటే, అరెస్టునే అవకాశంగా అబ్దిపొందాలని మరొక పార్టీ ముందడుగు వేయడం, ఈ వ్యవహారాన్ని చూస్తూ ముడో పార్టీ వ్యూహాలు రూపొందించడం వంటివి అంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.

pawan modi

భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులు, అవగాహన వంటి విషయాల్లో ఎలా వ్యవ్వహరిస్తాయో తెలియని విషయం కాదు. ఒక రాష్ట్రంలో ఏదైనా పార్టీతో పొత్తు కుదుర్చుకునే ముందు బిజెపి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. కలిసొచ్చే పార్టీ సాధించగల ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తుంది. అదే తరహాలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కూడా పొత్తు కోసం వచ్చే పార్టీలను వివిధ కోణాల్లో అంచనా వేస్తాయి. కానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం “బాబు”కు ఎదురవుతున్నపరిస్థితులు అక్కడి రాజకీయ చదరంగాన్నే మార్చివేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆయన నడిపిస్తున్న వైసిపితో తాడోపేడో అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్  చంద్రబాబు అరెస్టు కాగానే నేనున్నాఅంటూ రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఆయన్ని కలిశారు. అంతేకాదు, పరామర్శ కోసమే వెళ్ళారనుకున్న వాళ్లకు జనసేన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందనే తాజా సమాచారాన్నిజైలు ముందే అందించారు. ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ బిజెపి కలిసొచ్చినా రాకున్న ఇకపై టిడిపితోనే కలిసి ఉంటామని బహిరంగంగా ప్రకటించారు. గతంలో మాదిరిగానే బిజెపితో సఖ్యతగా ఉంటామనే మరో మాటా చెప్పారు. దిన్ని గమనించిన వైసిపి తనదైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తోంది.

pottu in

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడెక్కే సమయంలో పొత్తుల అసలు రంగు బయట పడుతుందనుకునే సమయంలో తెలంగాణ ఎన్నికలు రావడంతో వ్యూహాలకు పదును పెరిగింది. తెలంగాణ ఎన్నికల పోరులో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బిజెపిలు తమ తమ సాక్ష్యాలతో ముందుకు సాగుతున్న సమయంలో జనసేన కూడా ఇక్కడి ఎన్నికల్లో 32 చోట్ల పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించి, పోటీకి దిగనున్న నియోజక వర్గాలను కుడా ప్రకటించారు. ఇక్కడే సమస్యకు తెర లేచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసి ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగడం ఏమిటనే సందేహాలు తలెత్తాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పట్టు ఉన్న తెలుగుదేశం పార్టీతో ప్రమేయం లేకుండా జనసేన నిర్ణయం తీసుకోవడం తెలంగాణ టిడిపి వర్గాలకు నచ్చలేదు. ఇదే విషయాన్ని కాసాని జ్ఞానేశ్వర్ లాంటి వారే చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళిన సందర్భం కూడా ఉండడం గమనార్హం. తెలంగాణలో జనసేన అధినేత పవన్ బిజెపి వైపు చూడడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచనాసరళిలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలుగుదేశం వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చంద్రబాబు ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాక, చివరకు తెలంగాణలో జనసేన బిజెపితో కలిసి బరిలోకి దిగడం కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటిడిపి నాయక వర్గం, ఆ పార్టీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేక పోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు ఎలా ముందుకు సాగుతుందో అనే ఆసక్తికర వాదనలు, చర్చలు మొదలయ్యాయి. అక్కడ బలంగా ఉన్న అధికార పక్షాన్ని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు  కట్టుదిట్టమైన వ్యూహరచనలతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. టిడిపి,“సేన” పొత్తుని బిజెపి ఎలా అంచనా వేస్తుదనేది రాజకీయ రచ్చబండలో తాజాగా చర్చకు వస్తున్న అంశం. రెండు పార్టీల  ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన జరుగుతున్నప్పటికీ అంధ్రప్రదేశ్ లో  రాజకీయ వేడి రాజుకొని, ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి జరగనున్న పరిణామాలను సీనియర్ నేతలు, రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులే కాదు సామాన్య జనం కూడా ఇప్పటి నుంచే  అంచనా వేస్తున్నారు. తెలంగాణలో “సేన”తో కలిసిన బిజెపి ఆంధ్రలో తెలుగుదేశం-జనసేన కూటమితో కలుస్తుందా లేదా  అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. ఈ బేతాళ ప్రశ్నకి సమాధానం రావాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందడి మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. అంతేకాదు, నైపుణ్య శిక్షణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల నాటికి ఇంలాంటి చక్రం తిప్పుతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *