“భట్టి”వెలిగేనా..….!

batti


తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తన తొలి ముఖ్యమంత్రిగా ఎవరిని అందలం ఎక్కిస్తుంది? అధిష్ఠానం ఎవరికి ఆ పీఠాన్ని ఇవ్వనుంది? అధికార పక్షం పై పోరాడిన వారికా? పార్టీలో అనుభవం ఉన్నవారికా? లేక  సామజిక అంశమా? ఈ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహం పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్నలు. కాంగ్రెస్ అధినాయత్వం రాజస్థాన్, కర్ణాటక తరహా రచనలు చేస్తుందా లేక భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్న తెలంగాణలో కొత్త ఎత్తులు వేస్తుందా అనేది అసక్తికర చర్చగా మారింది. ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మొదలైన ఈ తరహా చర్చలు ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం సాధించడంతో మరింత ఊపందుకున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని కొందరు తేల్చి చెబుతుంటే కాదు, కాదు శాసన సభలో విపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క వైపే అధిష్ఠానం మొగ్గు చూపడం తథ్యమని మరి కొందరు బలంగా నమ్ముతున్నారు. రెండు, మూడేళ్లుగా అధికార పార్టీపై వీరోచిత పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తనదే అనే ధృడమైన నమ్మకంతో ఉన్నారు. సామాన్య ప్రజల్లోనూ అదే ఆలోచన ఉంది. కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలో పొరుగు రాష్ట్రంలో  అనుసరించిన విధానాన్ని అంచనా వేస్తే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి పదవి విషయంలో ప్రస్తుతం ఉన్న సమీకరణాలు వేగంగా మరే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం  నమ్ముతున్న కర్ణాటక ఉప  ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందే హైదరాబాద్ లో వాలిపోవడం, క్యాంపు రాజకీయాలపై వ్యూహరచన చేయడం మరింత ఆసక్తిని పెంచింది. క్యాంపు రాజకీయాల్లో “మహా ఘనుడు” అనే తిరుగులేని ముద్ర ఉన్న డి. కె. అధ్వర్యంలో కర్ణాటక నుంచి ఎంఎల్ఎ లను తెలంగాణకు తరలించడం, ఇక్కడ గెలిచే ఒక్కో అభ్యర్థికి ఒక కర్ణాటక ఎం.ఎల్. ఎ. ని ఎస్కార్ట్ గా పెట్టాలని అధిష్టానం తీసుకున్న నిర్ణయం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు ఉం డకూడదనే ఏకైక లక్ష్యంతో ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు సామజిక అంశంపైనే అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ మనుగడను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి, మరి కొందరు సీనియర్ నేతలను ఒప్పించి దళిత సామజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కను అధిష్టానం ప్రకటించే అవకాశం లేక పోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాక, భట్టిని తెరపైకి తీసుకురావడం వల్ల ఎలాంటి అసంతృప్తి రాగాలు తలెత్తక పోవచ్చాని పేర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వత వచ్చిన తొలి అవకాశాన్ని పదిల పరచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సందేహాలకు తెరపడనుంది. ప్రస్తుతం సి.ఎల్.పి. నేత ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంట నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *