తెలంగాణ ప్రజల బలం మూటగట్టుకొని పదేళ్ళ పాటు అధికారాన్ని అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చివరికి కృతజ్ఞత లేని వ్యక్తిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని రెండుసార్లు గద్దెనెక్కి కుటుంబం మొత్తం పదవులు అనుభవించిన కెసిఆర్ ఎన్నికల్లో పరాజయం పొందగానే ముడో కంటికి తెలియకుండా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కి పలాయనం చిత్తగించిన తీరును ప్రతీ ఒక్కరు తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమనే నైతిక సూత్రాన్ని కూడా కెసిఆర్ తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి తెలుపొండిన పార్టీని అభినందించడం కనిపిస్తుంది. కానీ, కెసిఆర్ వ్యవహార శైలి అందుకు భిన్నంగా ఉండడం, ఆయన పార్టీ పెద్దగా ఓటమిని అంగీకరించక పోవడం తెలంగాణ సమాజానికీ, రాజకీయ పరిశీలకులకు నచ్చడంలేదు. ఎన్నికల ఫలితాలపై కేటిఅర్ ప్రకటన జారీ చేసినప్పటికీ, ఉద్యమ నేతగా ఇంతకాలం జనంలో తిరిగిన కెసిఆర్ ఓటమి తర్వాత ఎలాంటి మాట,ముచ్చట లేకుండా ప్రగతి భవన్ నుంచి నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోయిన విధానం సరైంది కాదని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాదు, తన ప్రభుత్వ రాజీనామా పత్రాన్ని అధికారి చేత రాజ్ భవన్ కు పంపడం కుడా కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు కెసిఆర్ దొరతనానికి అద్దం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు తెలంగాణ మాదే అంటూ జనం మధ్య తిరిగిన నేత చెప్పాపెట్టకుండా సొంత ఊరుకి పోవడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కెసిఆర్ రాత్రికి రాత్రే ప్రోటోకాల్ ను సైతం పక్కన పెట్టి వెళ్ళిన తీరును చూస్తుంటే మహా భారతంలో ఓటమికి దగ్గరైనప్పుడు దుర్యోధనుడు చేసేది లేక మడుగులో దాచుకున్నన్న సందర్భం గుర్తుకు వస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.