రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి నేడు డా. బీఆర్.అంబెడ్కర్ తెలంగాణా సచివాలయంలో పదవీ భాద్యతలను స్వీకరించారు. సాయంత్ర్రం 4.20 గంటలకు సచివాలయం చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రధాన ద్వారం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీస్ అధికార బ్యాండ్ తో స్వాగతం పలికిన అనంతరం, ప్రధాన ద్వారం వద్ద నుండి కాలి నడకన సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకొన్నారు. కార్యాలయం లోపలికి ప్రవేశించగానే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సి.ఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో తన శ్రీమతి గీతతో కలసి పూజలు నిర్వహించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు రేవంత్ రెడ్డి తన అధికార ఆసనంపై కొలువుదిరారు. అనంతరం వేద పండితులు సిఎం దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవీ గుప్తా లతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సెక్రటేరియట్ అధికారులు, ప్రజాప్రతిధులు పాల్గొన్నారు.