“రాముడు అందరికి దేవుడే, మాకు కూడా దేవుడేనని, మతం పేరిట ప్రజలను విభజించి రాముడి పేరిట రాజకీయాలను చేసి లబ్ధి పొందాలని ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని” తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు . హైదరబాద్‌లో మతం పేరిట అలజడి సృష్టించి ఓట్లు పొందాలని చూస్తున్న కుయుక్తులను, వారి ఆటలను సాగనివ్వమని తేల్చి చెప్పారు. రాముడి పేరిట రాజకీయాలు చేయోద్దన్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజక వర్గ పరిధిలో వేర్వేరుగా జరిగిన ముషీరాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ కమిటీ నాయకుల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

పార్లమెంటు ఎన్నికల్లో కొందరి కోసం పని చేసే వారిని గెలిపిస్తే హైదరాబాదుకి అవమానం అని, అన్ని వర్గాలు, అన్ని మతాలకు చెందిన అందరి కోసం పని చేసే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. హైదరాబాదులో స్వేచ్ఛగా స్వతంత్రంగా ధైర్యంగా బతుకొచ్చన్న నమ్మకాన్ని కల్పించే విధంగా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని, ప్రజలు శాంతియుతంగా ప్రశాంతంగా బతకడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంపద సృష్టించి హైదరాబాదు ను అభివృద్ధి చేసిందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి చేసిన హైదరాబాదులోని విలువైన భూములను గత బిఆర్ఎస్ పాలకులు కొల్లగొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో విలువైన భూములు ఆక్రమించుకొని, రాష్ట్ర సంపద లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారే కానీ హైదరాబాద్ అభివృద్ధికి బిఆర్ఎస్ చేసినది ఏమి లేదన్నారు. పదేండ్లు ప్రజల సంపదను దోపిడి చేసింది సరిపోనట్టు అధికారం కోల్పోగానే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బిఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా నోరు పారేసుకుని మాట్లాడటం సరికాదన్నారు. పరిపాలించే నాయకులు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలే కాని, వీధి రౌడీ ల్లా మాట్లాడటం ఏం సంస్కారం కాదన్నారు. పది సంవత్సరాలు పరిపాలన చేసిన బిఆర్ఎస్ హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. త్రాగునీరు తీసుకొచ్చారా? కొత్త పరిశ్రమలు పెట్టారా? కొత్త విద్యాసంస్థలు నెలకొల్పారా? పేద మధ్యతరగతి ప్రజలకు కొత్త హౌసింగ్ బోర్డ్ నెలకొల్పారా? ఏం కొత్త అభివృద్ధి పనులు చేశారని నిలదీశారు. హైదరాబాదుకు గండిపేట, కృష్ణా, గోదావరి, మంజీరా నదుల నుంచి నీళ్లు తెచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి హైదరాబాదులో విద్యుత్ కోతలు లేకుండా చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు. హైదరాబాదులో అవుటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఉస్మానియా యూనివర్సిటీ, హైటెక్ సిటీ, బీహెచ్ఈఎల్, బి డి ఎల్, సాఫ్ట్వేర్ తదితర అభివృద్ధి రంగాలను గత కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పితే తామే చేశామని బిఆర్ఎస్ పాలకులు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంంగా ఉందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం, రాష్ట్రంలో బీసీ జన గణన కొరకు తీసుకోవలసిన చర్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు. బీసీ జనగణన పై క్యాబినెట్, అసెంబ్లీలో లోతుగా చర్చించి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను త్వరలోనే నిజం చేయబోతున్నామని ప్రకటించారు. అంబానీ, ఆదానీ లకు దేశ సంపదను దారా దత్తం చేస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్ర ను కార్పొరేట్ సంస్థలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. బిజెపి బీఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదని రెండు పార్టీలు ఒకటేనని అన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పరిపాలన చేసి రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసిందన్నారు. గత పది సంవత్సరాల పరిపాలనలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం లేకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. హైదరాబాద్ నగరంలో కరెంటు కోతలు ఉన్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ఆసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదుకు ఎంత కరెంటు సరఫరా చేసిందో లెక్కలతో సహా చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు అనిల్ యాదవ్, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ ఆడం సంతోష్‌కుమార్, ఏఐసిసి మాజీ సభ్యులు ఆడం ఉమాదేవి, నాయకులు ఆడం సృజన్, వాజీద్ హుస్సేన్, అభిషేక్, బ్రహ్మాజీ, గణేష్, రవికుమార్, హిందమతి, అనిత, ఉదయ్‌కాంత్, ఎలిజబెత్, దీపక్ జాను, అమర్‌నాథ్, కృష్ణకుమార్, సందీప్‌రాజు, షకీల్‌ఖాన్, యాదగిరి, కల్పనమ్మ, సుధాకర్ యాదవ్, అంజి యాదవ్, వి.డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.