“ప్రొఫెసర్”ఉద్యమ నేత.. మరి”సంతోష్”..!

what is c

తెలంగాణలో బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం విధి ,విధానాలను విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ళ పాటు అధికారాన్ని చెలాయించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నేతలు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలోనే ఉన్నట్టు, తమ మాటలే సాగలన్నట్టు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. కొత్తగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సుమారు నెల రోజులుగా బిఆర్ఎస్ నేతలు పొంతన లేని విమర్శలు, ఆరోపణలు చేయడం అంతుపట్టకుండా ఉందని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను, అది రూపొందిస్తున్న విధివిధానాలను ఎత్తి పొడిచే ప్రకటనలు చేయడం కూడా బిఆర్ఎస్ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం సన్నగిల్లుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేసిన ఆరు గ్యారంటీ హామీలని దశల వారీగా ఆచరణలోకి తీసుకువస్తున్న విషయం తెలిసి కూడా కేవలం ఆ పథకాలనే లక్ష్యంగా చేసుకొని ప్రజలను, బిఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడాన్ని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తీవ్రంగా పరిగణిస్తోంది. బిఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను బయట పెడుతున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికే కెటిఆర్, కవిత, కడియం శ్రీహరి వంటి నేతలు లేనిపోని విషయాలను తెరపైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఫూలే ఊసే ఎత్తని ఎమ్మెల్సీ కవిత అకస్మాత్తుగా అసెంబ్లీలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం ఉదాహరణగా చూపుతున్నారు. వాస్తవానికి  ఇదే  సామాన్యులను సైతం ఆలోచనలో పడేస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున కొత్త ప్రభుత్వంపై ఏదో రకమైన నిందలు మోపడానికి బిఆర్ఎస్ నేతలు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు.  ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే ప్రయత్నంలో ఆ పార్టీ తొందర పాటు విమర్శలు చేస్తోందని పేర్కొంటున్నారు. మొన్న గవర్నర్ కోటాలో ప్రొఫెసర్  కోదండరామ్ ఎన్నిక, వేం నరేందర్ రెడ్డి సలహాదారుగా నియమించడం పై  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను అసంతృప్తికి గురిచేస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో కోదండ రామ్ పాత్ర ఎంత ఉన్నదన్న వాస్తవం తెలిసి కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారని కెటీఆర్ నిలదీసే విధంగా ప్రశ్నించడం బిఆర్ఎస్ లోనే కొందరికి మింగుడు పడడం లేదు. 2014లో తెలంగాణ ఏర్పడగానే కోదండ రామ్ ని  అప్పటి టీఆర్ఎస్ ఎందుకు పక్కనపెట్టిందో ఉద్యమం పై అవగాహన ఉన్నవారికి తెలియని విషయం కాదు. ఆయన్ని గవర్నర్ ఎంఎల్ సిగా నామినేట్ చేస్తే ఎందుకు చేశారని వ్యాఖ్యానించడాన్ని బట్టి కోదండ రామ్ పై బిఆర్ఎస్ అగ్ర నేతలకు ఏ స్థాయిలో ఆగ్రహం ఉందనేది ఇట్టే తెలిసిపోతోంది. దేవిధంగా వేం నరేందర్ రెడ్డి నియామకం పై “ఆయన ఏం సలహాలు ఇస్తారని” కెటీఆర్ వ్యాఖ్యానించడాన్ని కూడా పలువురు తప్పుపడుతున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తన పని తీరును మెరుగుపరచు కోవడానికి మార్పులు, చేర్పులు చేయడం సహజం అనే నైతిక సూత్రం కూడా  కెటీఆర్ కు తెలియకపోవడం విచారకరమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు, 2014 లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సరైన అనుభవం లేని అనేక మందికి పదవులు కట్టబెట్టిన సంగతి మరచిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ అండదండలతో పదవీ విరమణ చేసిన అనేక మంది అధికారులు ఇతరులకు అవకాశం ఇవ్వకుండా సలహాదారులుగా, ఇంచార్జీలు కుర్చీలు వదలని విషయాన్ని లేవనెత్తుతున్నారు. అంతేకాక ప్రగతిభవన్ లో ఓ అవినీతి పరుడుని  పిఆర్ఒగా నియమించుకొని, అతని అక్రమాలు పరాకష్టకు చేరడంతో గత్యంతరం లేక అతన్ని తొలగించిన ఉదంతాన్ని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో ఇలాంటి అనేక లొసుగులు ఉండడంతో కెటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి కొత్త తరహా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా కోదండరామ్ పై చేసిన వ్యాఖ్యలకు బదులుగా తెలంగాణ ఏర్పడగానే సంతోష్ కుమార్ ని బిఆర్ఎస్ ఏ ప్రాతిపదికన  రాజ్యసభకు పంపిదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ అధికారం చేపట్టాక ముందు బాహ్య ప్రపంచానికి తెలియని సంతోష్ ని ఒక్కసారిగా రాజ్య సభకు ఎలా ఎన్నుకున్నారని కాంగ్రెస్ నేతలు ఎదురు దాడికి దిగనున్నారు. ఇలాంటి అనేక విషయాలను మరచిపోయి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా, బాధ్యతగా పాల్గొన్న కోదండ రామ్ ఎన్నికను ప్రశ్నించడం సమంజసం కాదని తెలంగాణ వాదులు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వెనుకా ముందు ఆలోచించకుండా ప్రచారం కోసం ప్రకటనలు చేస్తే ఇలాంటి అనేక అంశాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తామని కూడా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *