తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపి రేసుగుర్రాన్ని తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాలిచ్చే బర్రెను కాదని ప్రజలు దున్నపోతును తెచ్చుకున్నారని నల్లగొండలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కంచెర గాడిదలకు అధికారం ఇక కలగానే మిగులుతుందన్నారు. నన్ను చంపుతారా అని కేసీఆర్ అనడం విడ్డూరంగా ఉందని చచ్చిన పామును ఎవరైనా చంపుతారా అని ప్రశ్నించారు. సూటిగా సవాల్ విసురుతున్నా“పదేళ్లు వెంట్రుక కూడా పీకలేవ్” అంటూ కెసిఆర్ పై విరుసుకు పడ్డారు. ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమ ప్రభుత్వానిది 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబమని, మొన్నటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారే తప్ప నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామనీ, ఇందులో భాగంగానే 13,444 మంది ఉద్యోగులకు ఇవా నియామక పత్రాలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 15 రోజుల్లో కానిస్టేబుల్స్ కు నియామకపత్రాలు అందించినట్టు రేవంత్ చెప్పారు. పదేళ్లు నియామకాలు లేకపోవడంతో నిరుద్యోగులు నష్టపోతారని వయసు 44 నుంచి 46 ఏళ్లకు పెంచినట్టు, ఏ తప్పు లేకుండా, ఎవరికి నష్టం జరగకుండా ఇచ్చిన హామీ మేరకు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనీ స్పష్టం చేశారు. కేసీఆర్ తన బంధువులకు, కుటుంబ సభ్యులకు పదవులు లేకపోతే వంద రోజులు కూడా ఆగలేకపోయారని, కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజం బహిష్కరించిందనే విషయాన్నిఇప్పటికైనా కేసీఆర్ అర్థం చేసుకోవాలన్నారు.
నిరుద్యోగులూ..నేనున్నా..
సీఎం గా ప్రమాణం చేసినప్పుడు తనకు ఎంత ఆనందం కలిగిందో నేడు ఉద్యోగ నియామక పత్రాలు అంద జేస్తున్నప్పుడు అంతే సంతోషం కలుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఉద్యోగాలు సాధించిన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆయన ఎంపిక పత్రాలను అందజేశారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి యువతను గట్టెక్కిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులు అధైర్య పడొద్దని సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.