రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టరెట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయగూడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1కోటి 50 లక్షల రూపాయలతో ఆధునికరించిన భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ మిడ్ వైఫరీ శిక్షణ సంస్ధను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగ్ విద్యలో మిడ్ వైఫరీలో శిక్షణ తీసుకున్న వారు 83% ప్రసూతి మరణాలు, నవజాత శిశువుల మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తారని గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ సవాళ్ళను, సిజేరియన్ ప్రసవాల నివారణకు మిడ్ వైఫరీ సిబ్బంది కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

తల్లికి ప్రసవ అనుభవం ఇవ్వడంలో మిడ్ వైఫరీ శిక్షణ పొందిన సిబ్బంది పాత్ర ఎంతో ఉందన్నారు. దేశంలోనే ఈ శిక్షణలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో మరిన్ని మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలను లను ఏర్పాటు చేయడానికి కృషి చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 18 నెలల ప్రొఫెషనల్ మిడ్ వైఫరీ శిక్షణను పూర్తి చేసుకున్న నర్స్ ప్రాక్టీషనర్ అభ్యర్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్ వి కణ్ణన్, ప్రజారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, నర్సింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ విద్యుల్లత తదితరులు పాల్గొన్నారు.