రా “గురూ”…

IMG 20240320 WA0015

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్‌ బాబాను, ఆయన యాజమాన్యం లోని పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.ఆరోగ్య రక్షణకు సంబంధించి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని ఆ సంస్థ హామీ ఇచ్చింది. అయితే దానిని విస్మరించి, మీడియాలో ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారని న్యాయస్థానం తాజాగా అభిప్రాయపడింది.1954 వ సంవత్సరపు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ అభ్యంతరకర ప్రకటనలు చట్టం లోని సెక్షన్‌ 3, 4 ను రాందేవ్‌, బాలకృష్ణ ఉల్లంఘించా రనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తులు హిమా కోహ్లీ, అహ్సనుద్దీన్‌ అమానుల్లా తెలిపారు.వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధాన మివ్వాలని వారిద్దరినీ జస్టిస్‌ కోహ్లీ ఆదేశించారు. రాందేవ్‌, బాలకృష్ణ లకు ఫిబ్రవరి 26న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని అందులో తెలిపింది. గుండె జబ్బులు, ఆస్థమా వంటి వ్యాధులను నయం చేస్తామంటూ ఆధారాలు లేని వాదనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆ వ్యాధులకు సంబంధించిన ఔషధాల గురించి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఆ వ్యాపార ప్రకటనలను తొలగించడానికి తీసుకున్న చర్యలేమిటో తెలియజేస్తూ అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.గత సంవత్సరం నవంబర్‌లో కూడా పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలను ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ఇలాంటి ప్రచార కార్యకలాపాలను కొనసాగిస్తే కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *