తెలంగాణలో పేదలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందించాలని, అసంఘటిత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం తరఫున గుర్తింపు కార్డులు ఇచ్చి, గుర్తింపు కార్డులు తీసుకున్న ప్రతి కార్మికునికి నెలకు పది రోజుల పని దినాలకు తగ్గకుండా రోజు వేతనంతో కూడిన పని కల్పించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు.
హైదారాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన జై స్వరాజ్ పార్టీ కార్మిక సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అసంఘటిత కార్మికుల సమస్యల పోరాటాలకు త్వరలో కార్యాచరణ చేపడుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు కోటి మందికి పైగా అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది రోజు కూలీలే కాగా, పని దొరికితే పండగ లేక పోతే ఎండుడే అన్నట్లుగా వారి జీవితాలు ఉన్నాయన్నారు. నెలలో పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల పని దొరికితే మహా గగనంగా ఉందనీ, వచ్చిన కూలితో ఇంటి కిరాయి, కుటుంబ పోషణకే సరిపోవడం లేదని, ఇక పిల్లల చదువులు, అనారోగ్య సమస్యల వంటివి అదనపు భారం పడుతోందని కాసాని పేర్కొన్నారు. వీటికి తోడు వలస కార్మికుల పోటీ ఉంది. దీంతో పని దినాలు తగ్గుతున్నాయనీ, జై స్వరాజ్ పార్టీ పేదలు లేని తెలంగాణ ఏర్పడాలని కోరుకుంటూ పోరాటాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదలు లేని సమాజ నిర్మాణం జరగాలంటే ముందుగా అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అందుకే జై స్వరాజ్ పార్టీ అసంఘటిత కార్మికులకు ప్రతి నెలా పది రోజుల కనీస పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేఎస్ఆర్ గౌడ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ ఎస్ జే థామస్, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడెం బిక్షపతి, నాయకులు ఇంద్రాల సత్యనారాయణ, గూడెం రాజ్ కుమార్, తప్పెట్ల ఏలియా, ఇంజ గణేష్, కొమ్ము యల్లయ్య, బొడిగ అంజయ్య, రంగల నవీన్, తప్పెట్ల జయరాజ్, జంగ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.