ఫామ్ హౌస్ లో”కరెంటు”- జైలులో”మత్తు”.!

kcr kavit c

బుకాయించడంలో ఉద్యమ పార్టీ అధిపతులు ఒకరిని మించి మరొకరుగా ఉన్నారు.  హైదరాబాద్  నుంచి  కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలోకి పకడ్బందీగా పావులు కదిపిన కల్వకుంట్ల కవిత తీహార్ జైలు ఊసలు లెక్కబెట్టే వరకు ముడుపులతో ఏ మాత్రం సంబంధమే లేనట్టు మీటింగుల్లోనూ, మీడియా ముందూ బుకయించిన సంగతి అందరికీ తెలిసిందే. డేటా మొత్తాన్ని తొలగించి తనకేమీ తెలియదు అన్నట్టు ఫార్మాట్ చేసిన ఫోన్ లను విచారణ సంస్థల చేతిలో పెట్టిన ఆమె జైలు జీవితం నెలలు గడుస్తున్నా బెయిల్ మంజూరుకు కుమారుని పరీక్షల సాకు తప్ప మరే అవసరమైన వాదనలు వినిపించలేక పోవడం గమనార్హం.

kavit cell

అంతకు మించి…!

ఇప్పుడు కవిత తండ్రి కేసీఆర్ వ్యవహారం కూడా బకాయించడంలో అంతకు మించి ఉందని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. పదేళ్ల పాలనలో “ఎంత” వెనుకేశారో తెలియదు గానీ దేశాన్ని పాలించే ఆలోచనలో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చారు. పాలన,ఆర్థిక నిర్ణయాలు, కాంట్రాక్టు ఒప్పందాలు, పార్టీ పేరు మార్పు వంటివి  హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అప్పటి ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ హుకుమ్ తోనే జరిగేవన్నది బహిరంగ రహస్యం. మంత్రి వర్గ సహచరులు, పార్టీ అనుచరులు, అనుభవజ్ఞుల మాటలకు తావు ఇవ్వని ఆయన చివరికి అత్యంత కీలకమైన పాలన, పధకాల అమలులో అధికారుల సూచనలు, సలహాలను సైతం సహించే వారు కాదనే బలమైన విమర్శలు వస్తున్నాయి. చివరికి ఇప్పుడు న్యాయ వ్యవస్థ, న్యాయ రంగ నిపుణులను కూడా శాసించే తరహాలో కేసిఆర్ పెట్రేగి మాట్లాడడం ప్రతీ ఒక్కరినీ విస్మయ పరుస్తోంది. ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణల పై మాజీ ముఖ్యమంత్రిని అనే విషయాన్ని కూడా మరచి పోయి లేఖ రాసిన విధానమే తాజా ఉదాహరణగా కనిపిస్తోంది.

kcr kavit in

భారసా హయాంలో ఛత్తీస్ గడ్ నుంచి సాగిన విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అక్రమాల జరిగాయన్న ఆరోపణలను నివృత్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ విచారణ కమిటీనే కేసీఆర్ నిందించడం పట్ల న్యాయ రంగ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా విచారణ కమిటీ చైర్మన్, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహా రెడ్డినే బాధ్యతల నుంచి తప్పుకోవాలని, విచారణ సరిగా చేయడం లేదని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన మీరు బాధ్యతలు విస్మరిస్తున్నారనే విధంగా నరసింహా రెడ్డినీ, ఆయన పనితీరును శంకించడం అంతుపట్టని విషయం. అంతేకాదు, జస్టిస్ రెడ్డి బాధ్యతల నుంచి తప్పుకోవాలని హుకుం జారీ చేసినట్టు కేసీఆర్ లేఖ రాయడం అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించే ఎత్తుగడలో భాగంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎదైనా ఒక అంశం పై విచారణ చేసే సి.బి.ఐ., ఈ.డి, ఎన్.ఐ.ఏ. వంటి సంస్థలకు గానీ, ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రత్యేక విచారణ సంఘాలకు గాని, జ్యుడీషియల్ విచారణ కమిటీకి గానీ సహకరించాల్సిన నైతిక బాధ్యత ప్రతీ పౌరుని పై ఉంటుంది. అలాంటిది పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి విచారణ కమిటీ ముందు తన వాదనలు వినిపించాల్సింది పోయి కమిటీ ఛైర్మన్ తప్పుకోవాలని డిమాండ్ చేయడం విచిత్రమైన పరిణామం అనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈ.ఆర్.సి.)అనుమతి మేరకే ఛత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్టు కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఈ.ఆర్.సి.తుది అనుమతి లేకుండానే కొనుగోళ్లు జరిగాయని డిస్కం కుండబద్దలు కొట్టినట్టు చెబుతోంది. గత ప్రభుత్వ నిర్వకం ఫలితంగా దాదాపు 6000 కోట్ల రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం అయిందనేది ప్రస్తుతం  విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల అంచనా. విచారణ కమిషన్ ను బెదిరించడానికే కేసిఆర్ ఉద్దేశ్య పూర్వకంగా ఆ లేఖ రాశారని ఉప ముఖ్యమంత్రి వంటి వారు తేల్చి చెబుతున్నారు. వాస్తవాలను తప్పుదోవ పట్టించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలోనే కేజ్రివాల్ విచారణ సంస్థలకు సహకరించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. జస్టిస్ నరసింహా రెడ్డిపై లేఖ రూపంలో వ్యక్తిగతంగా దాడికి పాల్పడడం సమంజసం కాదని సీనియర్ న్యాయవాదులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *