రియల్ ఎస్టేట్ వెంచర్లల్లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు విద్య, వైద్యం అందించాలని జై స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసింది. నిర్మాణాలలో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు పని ప్రదేశాల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలన్నారు. కార్మికుల పిల్లలకు నిర్మాణాల వద్ద పాఠశాలలు ఏర్పాటు చేయాలని జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ కోరారు. కార్మిక నాయకులు, పార్టీ నాయకులతో హైదారాబాద్ లోని తెలంగాణ లేబర్ కమిషనర్ కృష్ణ ఆదిత్యను కలిశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్మాణాలు, వెంచర్లలో లక్షలాది అసంఘటిత కార్మికులు పని చేస్తున్నారని, ఇందులో అనేక మంది వలస కార్మికులు ఉన్నారని, వారు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారని కాసాని కమిషనర్ కు వివరించారు. ఈ మేరకు కృష్ణ ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు.
కార్మికులతో పాటు వారి పిల్లలు కూడా వెంచర్ల వద్ద వేసే గుడిసెల్లో నివసిస్తున్నారనీ, తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమైతే వారు మట్టిలో ఆడుకుంటూ ఉంటున్నారన్నారు. వారు పాఠశాలకు వెళ్ళాల్సిన వయసులో పని ప్రాంతంలో విలువైన కాలం వెళ్ళదీస్తున్నారు. వీరూ రేపటి దేశ పౌరులే. కాబట్టి వీరికీ విద్యా సదుపాయాలు కల్పించాల్సిందే. అందుకే ప్రతి వెంచర్ వద్ద ఒక పాఠశాల ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలనీ, ప్రతి వెంచర్ వద్ద ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ను అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందించాలని కాసాని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు, వారి పిల్లలకు ఈ సదుపాయాన్ని కల్పించడానికి లేబర్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే జై స్వరాజ్ పార్టీ, జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్, భవన నిర్మాణ అసంఘటిత కార్మిక చైతన్య సంఘం, పెయింటర్స్ అసోసియేషన్ తదితర సంఘాలతో ప్రత్యక్ష ఆందోళనలు చేస్తాయని నాయకులు కమిషనర్ కు చెప్పారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారికి హామీ ఇచ్చారు. లేబర్ కమిషనర్ ను కలిసిన వారిలో జై స్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు గోలుకొండ రత్నం, జై స్వరాజ్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి యామిని లక్ష్మీ, జేఎస్టీయూసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు చిగూరు శ్రీనివాస్, మాటూరి కృష్ణ మోహన్, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడెం బిక్షపతి, కార్మిక నాయకులు గొలుకొండ లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.