దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ జారీ చేసే విద్యుత్ బిల్లులపై “క్యూఆర్” కోడ్ ను ముద్రించనున్నారు. తమ మొబైల్ ఫోన్ ద్వారా ఈ “క్యూఆర్” కోడ్ ను స్కాన్ చేసి వినియోగదారులు తమ బిల్లులు చెల్లించవచ్చు. ఈ “క్యూఆర్” కోడ్ తో కూడిన బిల్లులు వచ్చే నెల నుండి వినియోగదారులకు అందుబాటు లోకి రానున్నాయి. రిజర్వు బ్యాంక్ కొత్త నిబంధనల వల్ల కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ లో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయం లేకున్నా, ప్రస్తుతానికి బిల్లు వసూళ్లపై ప్రభావం పడలేదు. ఈ రోజు ఉదయం పది గంటల వరకు దాదాపు 1.20 లక్షల వినియోగదారులు బిల్లులు చెల్లించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంస్థ వెబ్ సైట్, మొబైల్ యాప్ నుంచి బిల్ డెస్క్-పేటిఎం, టి.ఏ. వాలెట్, ఆన్లైన్, మీ సేవ, టి.వాలెట్ ద్వారా బిల్లులు చెల్లించ వచ్చు. వినియోగదారులకు మరింతగా సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.