చేరికలా… చొరబాటులా…?

erravlli ala c

తెలంగాణా ఉద్యమ పార్టీ భారత రాష్ట్ర సమితి (భారాస)లో ఏం జరుగుతోంది? ఆ పార్టీకి చెందిన నేతలు ఎందుకు గోడ దూకుతున్నారు?భారాస గొడుగు నీడ గిట్టడం లేదా లేక ఆ పార్టీ అధినేత ఇస్తున్న భరోసా పై నమ్మకం సన్నగిల్లిందా? కేసీఆర్ నమ్ముకున్న నేతలు పక్కా పార్టీల వైపు ఎందుకు ఎగబాకుతున్నారు? భారాస రాజకీయ వ్యూహంలో భాగంగా ఫిరాయింపులు జరుగుతున్నాయా?  లేక నేతలు ఎవరికి వారు సొంత నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకుంటున్నారా? అసలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఏం జరిగింది? నేతల వలసలు ఊపందుకోవడంతో తెలంగాణ సమాజంలో ఇలాంటి అనేక సందేహలు తలెత్తుతున్నాయి. దీనిపై “ఈగల్ న్యూస్” ప్రత్యేక విశ్లేషణ.

IMG 20240703 WA0045 1

వారం రోజులుగా భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. గత 26, 27 నెల తేదీల్లో ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశాలకు మొన్నటి ఎన్నికలల్లో గెలిసిన భారాస ఎమ్మెల్యేలు విధిగా హాజరయ్యారు. అధినేత చంద్రశేఖర్ రావు పూసగుచ్చినట్టు చెప్పిన మాటలను, సూచించిన వ్యూహాలను రెండు రోజుల పాటు ఆలకించారు. అయితే, ఆ సమావేశానికి హాజరై వచ్చిన మరుసటి రోజునే చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆరుగురు భారాస ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్టయింది. ఆ తర్వాత శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీని వీడే అవకాశం ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. ఐదారు రోజులు గడవక ముందే ఏకంగా ఆరుగురు భారాసకు చెందిన శాసన మండలి సభ్యులు అర్ధరాత్రి వేళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని భారీ కుదుపు చూపారు.

kcr mlas1

ఇదిలా ఉంటే, వ్యవసాయ క్షేత్రం నుంచి కేసిఆర్ చేస్తున్న ప్రకటనలను గులాబీ పార్టీ నేతలు నమ్మకం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం భారాస నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోందని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటానని, పోరాడతా అని కేసీఆర్ ఎమ్మెల్యేల సమావేశంలో హామీ ఇచ్చారు. ఈ సారి గెలిస్తే ఏకంగా 15 ఏళ్లు అధికారంలో ఉంటామని కేసీఆర్ ధీమాగా ఉన్నారు.

IMG 20240628 WA0047

ఆయన మాటలేమీ నమ్మశక్యంగా లేవంటూ కాలే యాదయ్య కాంగ్రెస్ గూటికి చేరారు. అదే బాటలో ఆరుగురు ఎమ్మెల్సీలు బిచానా ఎత్తారు. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టు భారాస నుంచి మరికొంత మంది గోడ దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్ ఫామ్ హౌస్ సమావేశాల తర్వాతే నేతలు పార్టీని ఎందుకు వీడి పోతున్నారనేదే ప్రధాన సందేహం. కేసీఆర్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారు సైతం ఆయనకు దూరం కావడాన్ని రాజకీయ పరిశీలకులు నిశ్చితంగా విశ్లేషిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ వారికి అంతర్గతంగా ఏలాంటి దిశానిర్దేశం చేశారనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. “వ్యూహం” ప్రకారమే అంటూ కొందరు భారాస నాయకులు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉంది. రాజకీయ ఇంటెలిజన్స్ వర్గాలు సైతం చేరికల పై దృష్టి పెట్టినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం జరుగుతున్న గోడ దూకుడులు చేరికలా, చొరబాట్ల అనేది వేచి చూడాల్సిన అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *