తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్ల వ్యయంతో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రపంచంలోని పది ప్రఖ్యాత యూనివర్సిటీలు ముందుకొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా 25 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే “ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ ఎఫ్)”, టెక్సస్ కేంద్రంగా ఉన్న ‘స్టార్టప్ రన్ వే’ సంస్థల ప్రతినిధులతో మంగళవారం నాడు సెక్రటేరియట్ లోని తన కార్యాలయంలో శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా స్టార్టప్ లను ప్రోత్సహించే ఈ రెండు సంస్థలకు అమెరికా లోని యూనిర్సిటీ ఆఫ్ టెక్సస్, యూకెలోని లండన్ బిజినెస్ స్కూల్ లాంటి పది ప్రఖ్యాత స్కిల్ యూనివర్సిటీలతో శిక్షణకు సంబంధించిన ఒప్పందాలున్నాయి.
సెప్టెంబర్ 26-28 ల మధ్య నగరంలో జరిగే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ సదస్సు లో ఈ యూనివర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారని శ్రీధర్ బాబు తెలిపారు. ఐఎస్ ఎఫ్ ఛైర్మన్ డా. జె.ఎ.చౌదరి, డైరెక్టర్ శేషాద్రి వంగల ఆధ్వర్యంలో టెక్సస్ రిచర్డ్ సన్ సిటీ, ఫ్రిస్కో సిటీల ప్రతినిధులు తనను కలిసి తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ’లో సంయుక్తంగా కార్యకలాపాలు చేపట్టడానికి ఆసక్తి వ్యక్తంచేసారని ఆయన వివరించారు. అమెరికా, బ్రిటన్ కు చెందిన కంపెనీలు ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సంధానకర్తలుగా ఈ ప్రతినిధులు వ్యవహరిస్తారని వెల్లడించారు. తెలంగాణాలోని స్టార్టప్ కంపెనీల ఉత్పత్తులకు అమెరికాలో మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడానికి సహకరిస్తారని అన్నారు. తమ ప్రభుత్వం స్టార్టప్ ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఇప్పటికే ఏర్పరిచిందని తెలిపారు. ఈ భేటీలో టెక్సస్ లోని ఫ్రిస్కో నగరం మాజీ మేయర్ మహెర్ మేసో, రిచర్డ్ సన్ సిటీకి చెందిన ప్రతినిధులు క్రిష్ షాక్లెట్, గ్రెగ్ సోవెల్, స్టార్టప్ రన్ వే వ్యవస్థాపకుడు మహేశ్ నంద్యాల, సిఓఓ రవీంద్ర రెడ్డి, చిన్మయ్ దాస్, జ్యోత్స్న కొండపులి, అర్చన చిందం, ఐఎస్ ఎఫ్ తరపున వేణుమాధవ్ గొట్టుపుల్ల తదితరులు పాల్గొన్నారు.