స్మితా సబర్వాల్… ఈ పేరు, ఆమె చిత్రాలు తెలియని సామాజిక “మాధ్యమకారులు” ఉండరు. ఆమె పోస్టింగ్ సోషల్ మీడియాలో ఒక వైరల్.. మరో ఆకర్షణ. తెలంగాణ రాష్ట్రం వేదికగా గత ఏడెనిమిది ఏళ్లుగా సోషల్ మీడియాలో ఆమెకు అనేక లైక్ లు, ఫాలోయింగ్ లు…అసలు ఆమె ఒక ప్రభుత్వ ఉన్నతాధికారా లేక “నెట్టింట్టి” దత్త పుత్రికా అన్న రీతిలో ఎక్స్, ఇన్ స్టా గ్రామ్ లో ఆమె అకౌంట్లు కనిపిస్తాయి. భారత పరిపాలనా అంశాల్లో శిక్షణ పొందిన స్మిత మహిళా ఐఎఎస్ లలో క్రమశిక్షణ గల అధికారిణిగా ఆనేక ఏళ్లు రాణించారు. అందుకే ఆమె భారాస ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో పాతుకుపోయారు. ప్రభుత్వ అధికారిగా, అదీ ఒక సివిల్ సర్వెంట్ హోదాలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమెలోని “సామాజిక” కోణం మరచిపోక పోవడం విశేషం. అందుకే, ప్రతీ రోజూ ఆమె పనులతో పాటు, కట్టు,బొట్లను తెలియకనే తెలియజేస్తూ సామాజిక మాధ్యమాలలో నిత్యం ఉద్యమించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది మహిళా ఐఎఎస్ అధికారులు వివిధ హోదాల్లో ఉన్నప్పటికీ వారితో పోలిస్తే స్మిత ప్రవర్తన భిన్నంగా కనిపిస్తుందనేది అందరికీ తెలిసిన సంగతే.
అయితే, వ్యక్తి గత స్వేచ్ఛ, భావ ప్రకటన,వాక్ స్వాతంత్ర్యం గురించి సివిల్స్ అధికారి అయిన స్మితా సబర్వాల్ కి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఆ స్వేచ్ఛా, స్వాతంత్రాలను ఎక్కడ, ఎప్పుడు, ఎలా వాడుకోవాలనే విషయం తెలిసి కూడా ఆ చిన్న లాజిక్ మరచి పోవడం ప్రస్తుతం ఆమెకు ఇబ్బందిగా మారింది. దేశంలో ప్రతీ ఒక్కరు అక్కున చేర్చుకునే దివ్యంగులను ఆమె లక్ష్యంగా చేసుకోవడం వివాదంలోకి లాగింది. పాలన వ్యవహారాల్లో అంత పెద్ద శిక్షణ పొంది కూడా దివ్యాంగుల శక్తి,సామర్థ్యాలను కించపరుస్తూ స్మిత చేసిన పోస్టు ఆమె ఊహించిన సంచలనం కంటే రచ్చకు, చర్చకు దారి తీసింది. దివ్యంగ సంఘాల నేతలు ఆమె అజ్ఞానాన్ని ఉదాహరణలతో సహా విధి కిడ్చాయి. ప్రపంచంలో వివిధ రంగాల్లో మేధావులుగా వెలుగొందిన దివ్యంగుల జాబితాను ఆమె ముందు ఉంచారు. అసలు దివ్యంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఆమెకు ఎందుకనే ప్రశ్న తలెత్తింది. సివిల్స్ లో ర్యాంకర్ గా భారత పరిపాలన అంశంలో శిక్షణ పొందిన ఆమె ఏ ఆలోచనతో దివ్యాంగులను లక్ష్యంగా చేసుకున్నారనే వాదనలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. మహిళా సంఘాలు సైతం ఒక్కసారిగా మండి పడ్డాయి.
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగపరిచే విధంగా, దేశంలోని కోట్లాది మంది దివ్యాంగుల మనోభావాలను కించపరిచే విధంగా , స్మితా సబర్వాల్ ప్రవర్తించారంటూ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి స్మిత సబర్వాల్ మిగతా క్యాడర్ అధికారులకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యత గల హోదో ఉన్న అధికారులు పోస్టులు, ట్వీట్ లు చేయడం పై అటు ప్రభుత్వం, ఇటు హక్కుల కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.