జై స్వరాజ్ పార్టీ, జై హింద్ నేషనల్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పని చేయాలని నిర్ణయించాయి. జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై హింద్ నేషనల్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ మిశ్రా హైదరాబాద్ లోని హైటెక్స్ లో సమావేశమై దేశ సమకాలీన సమస్యలు, పేదరికం, అభివృద్ధి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన విధానం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడంలో కాంగ్రెస్ విఫలం అయిందని, దాని తమ్మునిగా బీజేపీ మారిందని అన్నారు. అందుకే దేశంలో సరికొత్త పార్టీలు వస్తున్నాయని, ఉన్నత భారత నిర్మాణం కోసం జై స్వరాజ్ పార్టీ, జై హింద్ నేషనల్ పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించామని, మరికొన్ని పార్టీలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. జై స్వరాజ్ పార్టీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో పని చేస్తుందని, జై హింద్ నేషనల్ పార్టీ ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో పని చేస్తుందని కేఎస్ఆర్ గౌడ తెలిపారు. తమ సమావేశం ఫల ప్రదంగా జరిగిందని, త్వరలోనే ఢిల్లీలో మరో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని జై హింద్ నేషనల్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ మిశ్రా పేర్కొన్నారు.