పాత్రికేయులు సమాజానికి పట్టే చీడ కు చికిత్స చేసే వైద్యులు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అంతటి బాధ్యత ఉన్న వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. హైదారాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కి పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించిన స్వాధీన పత్రాలను రేవంత్ అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవన్నారు.ఈ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందన్నారు. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని, అది మనకు మనమే పెంపొందించకోవాలన్నారు.ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు.
జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమన్నారు. గతంలో రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవని, కానీ, నేడు ఉన్మాద ధోరణితో కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలు, ఛానళ్ళు నడపడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లు హద్దులు దాటి వ్యవహారించకూడదని సూచించారు. కొందరు విలేకర్లు చేసే వివాదాస్పద పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారని, అలాంటి వారిని నియంత్రించే బాధ్యత సీనియర్ జర్నలిస్టులు, వారి సంఘాల పైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయని, ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా, కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. వ్యక్తి నచ్చక పోవచ్చు వ్యవస్థలో గౌరవప్రదమైన పదవికి అయిన విలువ ఇవ్వాలన్నారు. గతంలో గాంధీ భవన్ లో సన్నిహితంగా మాట్లాడిన మాట్లలను రికార్డు చేసిన సందర్భలు ఉన్నాయని చెప్పారు. కొంతమంది జర్నలిస్ట్ లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా కాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశించారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గడచిన పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి అసలు పాలసీలే లేకుండా పోయాయని, అందుకే తమ ప్రభుత్వం టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు చేపట్టిందని వివరించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు మంజూరు చేశారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన వారికి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భాగస్వాములను చేస్తామని రేవంత్ జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు.