రాజకీయాల్లో మీరు ఏ గొడుగు కింద పెరిగారో కానీ మిమ్మల్ని పెంచి పోషించిన నేత సరైన శిక్షణ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా మీకున్న అజ్ఞానం వల్ల ఆ రాజకీయ సూక్తులు, అందులోని మెళకువలు మీ ఒంట పట్టలేదనేది అర్థం అవుతోంది. మీకున్న “బెదిరింపు కళ”కు నియోజక వర్గంలో గుండా గిరి దుకాణం పెట్టుకుంటే బాగుండేది. పొరపాటున టిక్కెట్ రావడం, దారి తప్పి గెలవడం ప్రజల దురదృష్టం అనుకుంటా. 2001వ సంవత్సరంలో ఎంపీటీసీగా ఓడిపోయిన మీరు అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పుష్కర కాలం గడిచిందంటే నియోజక వర్గ ప్రజల్లో మీ పట్ల ఉన్న “గౌరవం” స్పష్టంగా తెలిసి పోతోంది. జగన్ మంత్రి వర్గం నుంచి మిమ్మల్ని సాక్షాత్తూ గవర్నర్ తొలగించడం మీ అవివేకానికి నిలువెత్తు నిదర్శనం అనే వ్యాఖ్యలూ గత ఏడాది గుప్పుమన్నాయి.
రాజకీయాలు, వ్యాపారాలు, నియోజక వర్గంలో మీరు ప్రదర్శించే దౌర్జన్యం, జులుం పత్రికలు, మీడియా పై చూపిస్తే కుదరదనే కనీస విజ్ఞత లోపించడం దురదృష్టకారం. గతంలో అంటే 80వ దశకంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రస్తుత భాజపా ఎంపి డి.కే అరుణ భర్త భారత సింహారెడ్డి తన సారా వ్యాపారానికి అడ్డుపడుతున్నరనే అక్కసుతో అప్పటి ఒక ప్రముఖ దినపత్రిక ఉదయం విలేఖరిని కిడ్నాప్ చేసి రైలు పట్టాలపై పడుకోపెట్టిన ఘటన పాత్రికేయం పట్ల అవగాహన లేని రాజకీయ నేతలకు గొడ్డలి పెట్టు. ఈ ఘటనతో అప్పటి ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి ఏర్పడింది. జర్నలిస్టు సంఘాల ఉద్యమ ఫలితంగా అయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అతనిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ శాసన సభ్యులుగా మీరూ కనిపిస్తున్నారు. విలేకరులను నిలదీసి రైలు పట్టాలపై పడుకోపెడతా అని హెచ్చరించడం మీ రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోంది. విలేకరులు లోకో పైలెట్ లాంటి వాళ్లు ప్రజా ప్రతినిధులను ఎక్కడ నిలపాలో ఎక్కడ పరుగెత్తించాలో వారికీ తెలుసు. అలాంటి బాధ్యత గల విలేకరులను గుంతకల్లు జంక్షన్ లో మీరు కనీసం లూప్ లైన్ రైలు పట్టాల వరకు కూడా తీసుకువెళ్ళ లేరు. ఈ వాస్తవం మీకూ తెలిసి ఉండాలి.
మీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడు పాత అధినేత లాంటి వారు కాదు. మీరు విలేకరుల తాట తీస్తా అంటే పత్రికారంగంపై అపార గౌరవం ఉన్న చంద్రబాబు మీ తాట తీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే మీ అనాలోచిత మాటలకు వెంటనే టిడిపి ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షునితో ప్రకటన జారీ చేశారు. ఒక్క వాస్తవం గుర్తు పెట్టుకోండి, లేకుంటే ఎవరినైనా అడిగి తెలుసుకోండి.. రోజులు మారిపోయాయి, “సీమ” పౌరుషం ఇప్పుడు విధుల్లో కాదు.. మీ ఇంటి నాలుగు గోడల మధ్య చూసుకోండి.. రచ్చబండపై రెచ్చిపోతే తామరకుపై మంచు బిందువుగా రాజకీయాల నుంచి జార వేస్తారు. సమాజంలో నాలుగో పదంగా వెలుగుతున్న జర్నలిజం, జర్నలిస్టులపై పెట్రేగితే రాజ్యాంగంలోని ఒకటో, రెండో పాదాలు అణచి వేస్తాయి. రాజకీయ అధికారం తాత్కాలికం.. వ్యక్తిత్వం అమృతం లాంటిది దీన్ని కాపాడుకోండి. మీ గడ్డ నుంచి ఉద్దండులైన జర్నలిస్టులు ఉన్నారనే వాస్తవాన్ని తెలుసుకోండి. నాలుక మన ఆధీనంలో ఉంటే నలుగురికి దగ్గరవుతారు. అదే తాటి మట్ట అయితే జనమే తాట తీస్తారు.