విలువలు ముఖ్యం..

gouri

సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు మానవీయ విలువలు తోడైతే ఆ రంగాలలో సాధించిన ప్రగతి ప్రపంచానికి ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు పురోభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే మానవ శాస్త్రాల పరిజ్ఞానం కూడా ఆ శాస్త్రవేత్తలకు ఎంతో అవసరం అన్నారు. రవీంద్రభారతిలో ఎక్స్ ప్లోరా నాలెడ్జి ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో ఐఐటి టెస్ట్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు వార్షిక అవార్డుల ప్రదాన ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూలూరు విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషపై గౌరవాన్ని ప్రేమను పిల్లలకు బాల్య దశలోనే వారి మనసుల్లో నాటాలని చెప్పారు. మంచి పుస్తకాలు మంచి కథలు మంచి కవిత్వం చదువుకుంటే వాళ్లు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. మార్కులు, ర్యాంకులతో పాటు మానవీయ విలువలు కూడా ఎంతో ప్రధానమైనవి అని చెప్పారు. తల్లిదండ్రులు మంచి పుస్తకాలను సాహిత్యాన్ని చదువుతూ ఉంటే ఆ ప్రభావం పిల్లలపై బలంగా పడుతుందని విశ్లేషించారు. వినోదానికి పెట్టే ఖర్చులో పుస్తకాలను కూడా కొనేందుకు వెచ్చించాలని కోరారు. మనిషిని మనిషి ప్రేమించే మహోన్నత సంస్కృతిని పిల్లల మనస్సుల్లో నాటాలని ఈ గురుతరమైన బాధ్యతను విద్యాసంస్థలు చేపట్టాలని జూలూరు విజ్ఞప్తి చేశారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఎక్స్ ప్లోరా నాలెడ్జి ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 350 స్కూళ్ళలో వేలాది మంది విద్యార్థులకు నిర్వహించిన ఐఐటి టెస్టులో ప్రతిభ చూపిన రెండువందల మంది విద్యార్థులకు జూలూరు సర్టిఫికేట్లను, మెమొంటోలను బహూకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *