శ్రీ చైతన్య విద్యా సంస్ధల అధినేత బీ.ఎస్ రావు అకాల మరణం అత్యంత బాధాకరమని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో బీ.ఎస్ రావు భౌతిక కాయానికి చంద్రబాబు నాయుడు , లోకేష్, బ్రహ్మిణి విడివిడిగా నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ బీఎస్ రావు మంచి దూరదృష్టి ఉన్న వ్యక్తి అని, సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ శక్తిగా ఎదిగారన్నారు. బీఎస్ రావు దంపతులు డాక్టర్లుగా ఇంగ్లాండ్, ఇరాన్ లో 12 ఏళ్లు వైద్య సేవలందింసినా, పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలన్న లక్ష్యంతో విద్యాసంస్ధను స్ధాపించడం గర్వించ దగ్గ విషయం అన్నారు. మహిళల విద్యాభివృద్ది కోసం మొదట పాఠశాల ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి 21 రాష్ట్రాల్లో 321 జూనియర్ కాలేజీలు, 430 స్కూల్స్ స్ధాపించారన్నారు. వీటి ద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి కల్పించారని, 1995లో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బీ.ఎస్ రావుతో సహా పలు విద్యాసంస్ధల అధినేతల్ని పిలిచి విద్యార్దులకు ఐఐటీ కోచింగ్ ఇవ్వాలని ప్రోత్సహించినట్టు చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.