
భారత్ -అమెరికాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం కోసం ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను మరింత పెంచేందుకు హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని యూఎస్ఎ ఎన్నారైలు అబిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికాలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి తెలుగు ఎన్నారైలు కలిసి తమ విజ్ఞప్తిని లేఖ రూపంలో అందించారు. ఢిల్లీ, ముంబై వంటి అనేక నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులను కలిగి ఉన్నాయని, అమెరికా నుండి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని ఏర్పాటు చేయడం వల్ల పెద్ద పట్టణాలకు సమాంతర అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు. హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గాన్ని ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతో పాటు, కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృషి చేస్తోందని, కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. విలాస్ జంబుల, లక్ష్మణ్ అనుగు, సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ తుమ్మల, ప్రదీప్ కట్టా, వంశీ యమజాల, మధుకర్ రెడ్డి, రామ్ వేముల, రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్ దార్గుల తదితరులు మంత్రిని కలిశారు.